ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నడూ లేని కొత్త రాజకీయాన్ని భుజాన వేసుకున్నారు. ఇన్నాళ్లు సామాజికవర్గం పరంగానే రాజకీయం చేస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు మతం ప్రస్తావన తెస్తున్నారు. గతంలో ఎంత పెద్ద సమస్య ఎదురైనా కూడ మతం అంశం ప్రధానం కాలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఈ హిందూత్వం, క్రిస్టియానిటీ ప్రసవనాలే లేవు. కానీ ఇప్పుడు అవే వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఆలయాల మీద వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ మతాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. జగన్ క్రైస్తవుడు కాబట్టి హిందూ దేవాలయాల మీద దాడులను ఆరోపణలు చేస్తోంది.
వేరో కారణాలు కనబడలేదో లేకపోతే కొత్తగా ఏమైనా ట్రై చేయాలని అనుకున్నారో కానీ చంద్రబాబు కూడ అదే పాట అందుకున్నారు. మొదట్లో అంతర్వేధి ఘటన కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలాగే చేసింది. ఇక కొత్త దాడుల కేసులను కూడ సీబీఐకి బదిలీ చేయాలని చంద్రబాబు అన్నారు. సీఐడీ విభాగాధిపతి ఒక క్రైస్తవుడు కావడం వల్లనే కేసుల విచారణలో పురోగతి లేదని, నిందితులు దొరకట్లేదని అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్ఛారు. ఈ విషయమై హైకోర్టులో పిటిషన్లు కూడ దాఖలయ్యాయి. వాటిలో ఒక ప్రైవేట్ పిటిషన్ను విచారించిన హైకోర్టు మత ప్రస్తావనను తీసుకురావడాన్ని ఖండించింది.
సీఐడీ విభాగాధిపతి క్రైస్తవుడు అనే కారణం చూపి కేసులను సీబీఐకి అప్పగించాలని అందం సమంజసం కాదని, సీఐడీ విచారణ చేస్తోంది కాబట్టి ముందుగా ఆ విచారణ ఎలా ఉంటుందో చూడాలని, ఇలా ప్రభుత్వ అధికారులకు మతాన్ని ఆపాదించడం సరైంది కాదని తెలిపింది. దీంతో విచారణ ఆలస్యానికి కారణం మతపరమైన కోణమేనని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు ఇతర నాయకులకు గట్టి కౌంటర్ పడ్డట్టే అనుకోవాలి. గత ప్రభుత్వాల హయాంలో కూడ పలు విభాగాలు క్రైస్తవ మతానికి చెందిన అధికారులు పనిచేశారు. కానీ అప్పుడు రాని ఆటంకాలు ఇప్పుడు జగన్ సీఎంగా ఉండగా వస్తున్నాయని అనడం నిజంగా భావ్యం కాదు. జగన్ క్రైస్తవ మత విశ్వాసి అనే ఒకే ఒక్క కారణం చూపించి లబ్ధిపొందాలని అనుకోవడం అవకాశావాద రాజకీయమే అవుతుంది.