ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసు విచారణను కేంద్రంలోని ఎన్ఐఏకి బదిలీ చేయాలంటూ హైకోర్టు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశించింది. జగన్ పై హత్యాయత్నం కేసును తామే విచారిస్తామని చెబుతూ ప్రభుత్వం సిట్ విచారణకు నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, కేంద్రప్రభుత్వ పరిధిలోని విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది కాబట్టి రాష్ట్రప్రభుత్వం విచారణ చెల్లదంటూ కోర్టు స్పష్టంగా చెప్పింది. అందుకే ఎన్ఐఏ సెక్షన్ 6 (ఏ) ప్రకారం కేసు విచారణ మొత్తాన్ని ఎన్ఐఏకి బదిలీ చేయాలంటూ రాష్ట్రప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.
అదే సమయంలో కేసు విచారణను ఎన్ఐఏ విచారణకు తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కూడా కోర్టు ఆదేశించింది. విచారణ తీసుకునే విషయంపై తీసుకున్న నిర్ణయాలు ఏమిటో జనవరి 4వ తేదీలోగా చెప్పాలని కోర్టు చెప్పటం గమనార్హం. విచారణ మొత్తం చూస్తే ఎన్ఐఏతో విచారణ చేయించాలని స్పష్టంగా ఆదేశించటంలో కోర్టు కూడా ఎందుకో వెనకాడుతున్నట్లు అర్ధమవుతోంది. ఎన్ఐఏ చట్టం ప్రకారం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఎన్ఐఏ మాత్రమే విచారించాలని స్పష్టంగా ఉన్నపుడు అదే విషయాన్ని కోర్టు ఎందుకు స్పష్టంగా ఆదేశించటం లేదు ? ఎన్ఐఏకి విచారణను బదిలీ చేస్తు విచారించే అంశంపై ఏ విషయాన్ని తమకు జనవరి 4వ తేదీలోగా చెప్పాలని ఆదేశించటంలో అర్ధమేంటి ?
హత్యాయత్నం విచారణను ఎన్ఐఏకి బదిలీ చేయాలని చెబుతునే మళ్ళీ విచారించే అంశంపై తమకు సమాధానం చెప్పటం పట్ల అందరిలోను అయోమయం కనిపిస్తోంది. అంటే కోర్టు కూడా తన విఛక్షణను పూర్తిగా ఉపయోగించదలచుకోలేదని అర్ధమవుతోంది. మొదటినుండి కూడా కోర్టు విచారణ మొత్తం పాము చావకూడదు..కర్ర విరక్కూడదన్నట్లుగా సాగుతోంది. అక్టోబర్ 23వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం లాంజులో ఉన్న జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు హత్యాయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కోడికత్తితో నిందితుడు చేసిన దాడి మెడపై దిగాల్సిన పోటు జగన్ అదృష్టం వల్ల ఎడమభుజంలో దిగింది. దాంతో హత్యాయత్నం ఓ కుట్రేనంటూ జగన్ అండ్ కో కోర్టులో థర్డ్ పార్టీ విచారణ కోరారు. ఆ కేసు హై కోర్టులో విచారణ జరుగుతోంది.