కాంగ్రెస్ పార్టీలో హీరో రాజా… షర్మిళ తోపాటు ప్లాన్ ఇదే?

“ఆనంద్” మంచి కాఫీ లాంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన రాజా… రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తల్లి బ్రిటిషర్ కాగా, తండ్రి తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలో… సినిమాలపై ఇంట్రస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజా.. హీరో శ్రీకాంత్ హీరోగా వచ్చిన “ఓ చిన్నదాన” సినిమాతో నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు.

అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “ఆనంద్” సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల్లో నటించినా.. అనంతరం ఇండస్ట్రీకి దూరమైన ఆయన ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి పాస్టర్ అయ్యారు.

ప్రస్తుతం దైవ సేవకులుగా ఉన్న ఆయన… ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గిడుగు‌ రుద్రరాజు సమక్షంలో రాజకీయంగా తిరిగి సొంత గూటికి చేరారు. పార్టీలో జాయిన్ అయిన అనంతరం స్పందించిన ఆయన… కాంగ్రెస్ లాంటి సెక్యులర్ ఆలోచనలు ఉన్న పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు.

అలాంటి పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అని.. రాష్ట్రంలో కాదు దేశంలోని తెలుగు వారికి సేవ చేయాలనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరానని తెలిపారు. ఇక, మణిపూర్ అల్లర్ల ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన అభినందనీయమని.. దేశంలో ఎవ్వరూ సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని రాజా తెలిపారు.

ఆ సంగతి అలా ఉంటే… హీరో రాజా కాంగ్రెస్ కండువా కప్పుకున్న అనంతరం గిడుగు రుద్రరాజు స్పందించారు. నటుడు రాజా లాంటి వ్యక్తుల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ధిష్టానం ఆదేశాలతో రాజాను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకుంటామని…అలాగే వైఎస్ షర్మిల వచ్చినా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.

దీంతో… అటు రాజా, ఇటు షర్మిళ ను కాంగ్రెస్ పార్టీ ఏపీలో ప్రచారానికి ఉపయోగించుకోబోతుంది అనే చర్చ మొదలైంది. ఇందులో భాగంగా… క్రీస్టియన్ ఓటు బ్యాంకుపైనా, దళిత ఓటు బ్యాంకు పైనా కాంగ్రెస్ పార్టీ గురి పెట్టినట్లు ఉందని అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి అదంతా గతంలో కాంగ్రెస్ సాలిడ్ ఓటు బ్యాంక్ అనేది తెలిసిన విషయమే! అయితే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ నేతృత్వంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఆయన మరణం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, రాష్ట్ర విభజన నిర్ణయాలతో ఏపీలో కనుమరుగైపోయింది!

అయితే ఇప్పుడు ఏపీలో మరలా కాస్త మనుగడ కాపాడుకునే ప్రయత్నాల్లో ఉందని, అందులో భాగంగా తమ పాత ఓటు బ్యాంకుపై శ్రద్ధ పెడుతున్నట్లుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాస్టర్ రాజా ని ఫుల్ గా వాడేస్తామని, షర్మిళతో పాటు సేవలు పోందుతామని చెబుతున్నారు రుద్రరాజు!!