(బి పి కుమార్ )
రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానని, త్వరలో పార్టీ పెడుతున్నానని హడావుడి చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హఠాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని ఆయన ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఏమై ఉంటుందనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కోటరీ ఒత్తిడితోనే ఆయన వెనక్కు తగ్గినట్లు సమాచారం. కొద్దినెలలుగా జిల్లాల వారీగా తిరిగి స్థానికులతో చర్చలు జరిపిన లక్ష్మీనారాయణ ఇటీవలే సొంత పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. దాని పేరు వందేమాతరం అని మీడియాకు లీకులు కూడా అందాయి.
లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయగానే తెలుగుదేశం పార్టీలో కంగారు మొదలైంది. ఎందుకంటే ఆ పార్టీ వల్ల నష్టం జరిగేది తమకేనని వారి నిశ్చితాభిప్రాయం. తమ పార్టీ ఓట్లు చీలిపోతాయని టీడీపీ నేతలు లోలోన చర్చోపచర్చలు జరిపారు. చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టి లాభనష్టాలు బేరీజు వేశారు. చివరికి ఈయన పార్టీ వల్ల నష్టపోయేది తామేనని నిర్థారించుకున్నారు. ఇంకేముంది వెనువెంటనే బాబు మేనేజర్లు రంగంలో దిగిపోయారు. ఫలితం పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని మాజీ జేడీ ఉపసంహరించుకున్నారు. జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలోని లోక్‌సత్తా నేతృత్వ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్త లీకైంది.
ఆ రోజుల్లో సీబీఐలో ఉండే చాలామంది జేడీల్లో లక్ష్మీనారాయణ ఒక జేడీ. ఇలా అయితే ఆయనకు పేరు వచ్చేది కాదు. ఆయన ఎవరో కూడా జనానికి పెద్దగా తెలిసేది కాదు. జగన్‌పై సీబీఐ దాడులు చేసిన తర్వాత ఆయన పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన శోదాలు, దాడులు జరిపిన తీరు అంతా తెలుగుదేశం శ్రేణులు, వారి మద్ధతుదారులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఆ వర్గమంతా లక్ష్మీనారాయణను ఓన్ చేసుకుని హీరోగా చిత్రీకరించింది. జగన్‌పై వ్యతిరేక అభిప్రాయం ఉండే వారంతా లక్ష్మీనారాయణను కీర్తించారు. కానీ ఉన్నట్టుండి రాజకీయ క్రీడలో ఆయన పక్కకు తప్పుకోవాల్సివచ్చింది. ఏమైందో తెలియదు ఆరు నెలల క్రితం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తున్నానని మాజీ జేడీ ప్రకటించారు.
టీడీపీలో చేరతారని కొద్దిరోజులు, బీజేపీలోకి వెళుతున్నారని మరికొన్నిరోజులు ప్రచారం జరిగింది. టీడీపీ నాయకులు ఆయన కోసం ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆప్ ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ఆయన సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకుని ప్రకటించారు. కానీ రెండురోజుల్లోనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం విశేషం.
జగన్ వ్యతిరేకుల మద్ధతుతో పేరు సంపాదించి క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీనారాయణ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి ఓట్లు పడతాయి. ఆ వ్యతిరేక ఓట్లే ఆయనకు దిక్కు. అవన్నీ ఇప్పుడు టీడీపీ ఖాతాలో ఉన్నాయి. అంటే మాజీ జేడీ వల్ల టీడీపీ ఓట్లు చీలడం స్పష్టమైంది. అందుకే చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి లక్ష్మీనారాయణను తన వ్యూహంలో ఇరికించారని తెలుస్తున్నది. తనకు కొద్దిగా అనుకూలంగా ఉండే లోక్‌సత్తా జయప్రకాష్‌తో ఆయనకు జత కలిపి తనకు ఇబ్బంది లేకుండా చేసుకున్నారేది ఇప్పుడు తాజాగా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న టాక్.