ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి ఏంటనే ప్రశ్నకు బీజేపీ నేతల దగ్గర కూడా క్లారిటీ లేదని తెలుస్తోంది. కొన్నిసార్లు బీజేపీ నేతలు ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని చెబుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం రాజధానికి ఎంచుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకోమని చెబుతారు. అయితే బీజేపీ నేతలు ఒకే మాటపై నిలబడరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవిల్ నరసింహరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమని రాయలసీమ డిక్లరేషన్ విషయంలో కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు దిశగా రాష్ట్రం అడుగులు వేస్తే కేంద్రం సహకారం అందిస్తుందని జీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా చేయడానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.
అయితే ఈ కామెంట్ చేస్తూనే పరిపాలన ఒకచోట మాత్రమే ఉండాలని అభివృద్ది మాత్రం అన్ని జిల్లాలలో జరగాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జీవీఎల్ చేసిన కామెంట్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం కామెంట్లలా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు టీడీపీకి ఇటు వైసీపీకి కొంతమేర అనుకూలంగా జీవీఎల్ నరసింహారావు కామెంట్లు చెయడం గమనార్హం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరు ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని ఈ విధంగా చేయడం వల్ల ఏపీ ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోయారని తెలిపారు. బీజేపీ హైకోర్టుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ అతి త్వరలో ఆ దిశగా అడుగులు వేసే అవకాశం అయితే ఉందని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల విషయంలో కూడా బీజేపీ అధికారికంగా క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొంతమంది నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.