కొడాలి నానికి ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన బాబు… ట్విస్ట్ ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీకి అత్యంత సంక్లిష్టంగా మారిన గుడివాడ నియోజకవర్గం విషయంలో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

అవును… టీడీపీ అధినేత చంద్రబాబుకు మింగుడు పడని నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఈసారి కుప్పంలో తాను, మంగళగిరిలో తన కుమారుడూ గెలవడం ఎంత ముఖ్యమో… గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానీని ఓడించడం కూడా అంతే ముఖ్యం అని చంద్రబాబు భావిస్తున్నాడని అంటుంటారు. దీంతో… చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

గతకొంతకాలంగా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులపై రెండు పేరు ప్రముఖంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంతకాలం పార్టీకి సేవచేస్తున్న రావి వెంకటేశ్వర రావు ఒకరు కాగా… ఎన్నారై వెనిగళ్ల రాము మరొకరు. వీరిలో గతకొంతకాలంగా రావి వెంకటేశ్వర రావు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఆ సంగతి అలా ఉంటే… 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాశ్ వైసీపీలోకి వెళ్లిపోయినప్పటినుంచీ… రావి వెంకటేశ్వర రావు నియోజకవర్గ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే ఈసారి కొత్తగా వెనిగళ్ల రాము పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈయన ఆర్థికంగా బలమైన వాడు కావడంతో చంద్రబాబు ఈయనవైపే అనుకూలంగా వ్యవహరించే ఛాన్స్ ఉందని అప్పట్లో కథనాలు వచ్చాయి.

ఈ సమయంలో చాలా మంది ఊహించినట్లుగానే ఇన్ని రోజులూ పార్టీకి సేవ చేసిన రావి వెంకటేశ్వర్ రావు కు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఈ సమయంలో వెనికళ్ల రాముని గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు తాజాగా నియోజకవర్గం పరిధిలోని మూడు కీలక మండలాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు.

గుడివాడలో టీడీపీ అభ్యర్ధిగా వెనిగళ్ల రాము పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోన్న నేపథ్యంలో స్థానిక నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈసారి గుడివాడలో ఎట్టిపరిస్థితుల్లోనూ కొడాలి నానీ ని ఓడించాలనే పట్టుదలతో చంరబాబు ఉన్నారన్ని అంటున్నారు.