వైసీపీ శ్రేణులకు కింది స్థాయిలో ఏం జరుగుతోందన్నది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఓ వైపు అధినేత వైఎస్ జగన్, ‘వైనాట్ 175’ అంటోంటే, కాదు కాదు.. 125కే పరిమితమవుతామంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా కొన్ని లెక్కల్ని ప్రచారంలోకి తెస్తున్నారు.
‘టీడీపీ – జనసేన’ విడివిడిగా పోటీ చేస్తే, వైసీపీకి 155 సీట్లు వస్తాయట. అదే, రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే, వైసీపీకి 125 సీట్లు వస్తాయట. అయితే, ఈ 125 సీట్లలోనూ పక్కాగా కన్ఫామ్ అనుకున్న సీట్లు 70 మాత్రమేనట.! చాలా చోట్ల గట్టి పోటీ వుండబోతోందట. ఆయా నియోజకవర్గాల్లో పలితం ఎటైనా మారిపోబోతోందిట.
ఏం జరిగినా, 90 నుంచి 100 సీట్ల వరకు వైసీపీకి వచ్చి తీరతాయన్నది వైసీపీ మద్దతుదారులు చెబుతున్నమాట. కానీ, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, గ్రామ స్థాయిలో ఈక్వేషన్స్ అనూహ్యంగా మారాయి. చంద్రబాబుకి మద్దతుగా ఎంతమంది నినదిస్తున్నారన్న విషయం పక్కన పెడితే, జనసేన గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు, ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు.. కింది స్థాయిలో ఖర్చు చేయడం, జనాల్లోకి వెళ్ళడం.. వీటిని బట్టి, టీడీపీ – జనసేన కూటమి సాధించబోయే స్థానాల సంఖ్య ఆధారపడి వుంటుంది. అయితే, జనసేనకు తక్కువ స్థానాల్లోనే పోటీ చేసేలా టీడీపీ చేయగలిగితే, అది వైసీపీకే అడ్వాంటేజ్ అవ్వొచ్చు.
కాగా, పరిస్థితులు ఇంతలా స్పష్టంగా కనిపిస్తున్నా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం, ‘వైనాట్ 175’ అనే చెబుతున్నారు, పార్టీ ముఖ్య నేతల్ని ఉద్దేశించి. పార్టీలో నేతలకు ధైర్యాన్నివ్వడం వరకూ బాగానే వుందిగానీ, ఈ అతి విశ్వాసం కొంప ముంచితేనో.?