వైసిపికి ‘గౌరు’ కుటుంబం రాజీనామా ? జగన్ కు మైనస్సేనా ?

రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదని తేలిపోవటంతో వైసిపికి రాజీనామా చేయాలని కర్నూలు జిల్లాలోని గౌరు దంపతులు నిర్ణయించుకున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.  పోయిన ఎన్నికల్లో గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతోనే గెలిచారు. ఎప్పుడైతే తమ కుటుంబానికి శతృవైన కాటసారి రాం భూపాలరెడ్డిని వైసిపిలోకి జగన్మోహన్ రెడ్డి చేర్చుకున్నారో అప్పటి  నుండి గౌరు దంపతుల్లో అసంతృప్తి మొదలైంది.

రాబోయే ఎన్నికల్లో కాటసానికే టికెట్ అంటూ ఆయన మద్దతుదారులు చేస్తున్న ప్రచారంతో గౌరు దంపతుల్లో అభద్రత మొదలైంది. అదే విషయాన్ని జగన్ దగ్గర ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో కాటసానికే టికెట్ ఇస్తానని జగన్ కూడా స్పష్టంగా చెప్పారట. సిట్టింగ్ ఎంఎల్ఏని, వైఎస్ కుటుంబంతో దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసినా జగన్ వెనక్కు తగ్గలేదని సమాచారం.

‘కాటసానికి ఎంఎల్ఏ టికెట్ ఇస్తానని మాటిచ్చాను కాబట్టి మీకు ఎంఎల్సీ ఇస్తా’నని జగన్ ఇచ్చిన ఆఫర్ ను గౌరు దంపతులు తిరస్కరించారు. సిట్టింగ్ ఎంఎల్ఏగా తాముండగా కాటసానిని చేర్చుకోవాల్సిన అవసరం ఏమిటి ? అనేది గౌరు దంపతుల ప్రశ్న. అయితే గౌరు ప్రశ్నకు జగన్ నుండి సమాధానం లేదు. దాంతో పార్టీలో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్న దంపతులు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరుతున్నారు. గౌరు దంపతులను వదులు కోవటమంటే జగన్ కు మైనస్సే అని అనుకోవాలి.