గోరంట్ల మాధవ్ వీడియో లీక్.! ఔను, వైఎస్ జగన్ ఇమేజ్‌కి భారీ డ్యామేజ్.!

హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్‌కి ఎందుకు డ్యామేజ్ అవుతుంది.? అవుతుంది, అయి తీరుతుంది. కాదు కాదు, చాలావరకు డ్యామేజ్ అయిపోయింది.! మహిళా లోకంలో వైఎస్ జగన్ ‘చర్యలు తీసుకోలేనంత నిస్సహాయ స్థితిలో వున్నారు..’ అన భావన పెరిగిపోతోంది.

‘ఆ వీడియో మార్ఫింగ్ అని గోరంట్ల మాధవ్ అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అది మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటాం. కఠిన చర్యలే వుంటాయ్..’ అని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే చెప్పారు. కానీ, అది కాదు రావాల్సిన సమాధానం.! చాలా సీరియస్ అంశమిది. ఔను, చాలా చాలా సీరియస్ అంశమిది.

‘అది ముమ్మాటికీ ఒరిజినల్ వీడియో అనలేం. అలాగని, మార్ఫింగ్ అని కూడా అనలేం. ఫేక్ అనడానికి అవకాశాలు 30 శాతం మాత్రమే వున్నాయి.. 70 శాతం అవకాశాలు ఒరిజినల్ వీడియో అనేందుకే వున్నాయి..’ అని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా అభిప్రాయాలు చెప్పడం చూస్తున్నాం గోరంట్ల మాధవ్ వీడియోకి సంబంధించి.

టెక్నాలజీ పెరిగిపోయింది.. ఏది ఒరిజినల్.? ఏది ఫేక్.? అన్నది గుర్తించడం సామాన్యులకైతే కష్టం. కానీ, ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. సైబర్ క్రైమ్ విభాగంలో ఎక్స్‌పర్ట్స్ వుంటారు. ఓ ఎంపీకి సంబంధించిన వ్యవహారమిది. నిమిషాల వ్యవధిలో.. లేదంటే, కేవలం గంటల వ్యవధిలోనే.. విషయాన్ని తేల్చేయగల సత్తా ప్రభుత్వం వద్ద వుంటుంది.
రోజులు గడుస్తున్నాయ్.. విషయాన్ని జనం మర్చిపోతార్లే.. అన్నట్లుగా వుంది ప్రభుత్వం తీరు.

మరోపక్క, వీడియో, మారు మూల గ్రామాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ‘వీళ్ళా వైసీపీ ప్రజా ప్రతినిథులు.?’ అన్న ఛీత్కారం ఎదురవుతోంది ప్రజల నుంచి వైసీపీకి. ఇది పార్టీకి అస్సలు మంచిది కాదు. డైనమిక్ సీఎం.. అన్న గొప్ప పేరు నుంచి, చర్యలు తీసుకోలేనంత నిస్సహాయత ఎందుకు.? అన్న స్థాయికి వైఎస్ జగన్ ఇమేజ్ పడిపోవడం దురదృష్టకరం.! ఈ విషయమై వైసీపీ మద్దతుదారులు కూడా సోషల్ మీడియా వేదికగా అధినేతకు బోల్డన్ని సూచనలు చేస్తున్నారు.