జూనియర్ పంచాయతీ కార్యదర్శి అభ్యర్దులకు గుడ్ న్యూస్

జూనియర్ పంచాయతీ కార్యదర్శి అభ్యర్దులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించి డిసెంబర్ 25 లోగా నియామకపు పత్రాలు అందజేయాలని సీఎస్ ఎస్ కే జోషి కలెక్టర్లను ఆదేశించారు. భర్తీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించడంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆనందం ఏర్పడింది.

అన్ని జిల్లాల్లో ఎంపికైన అభ్యర్ధుల హాల్ టికెట్ల నెంబర్లను స్థానిక పత్రికల్లో ప్రచురించాలని ఆదేశించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్దుల సర్టిఫికేట్ల పరిశీలన 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రోజుకు 300 నుంచి 400 మంది అభ్యర్దుల సర్టిఫికేట్లు పరిశీలించేలా ఏర్పాట్ల చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులో సమర్పించిన విద్యార్హత, వయస్సు, కులం, ఆదాయ పత్రాలు, లోకల్, ప్రత్యేక కేటగిరిల సర్టిఫికెట్లు, ఒరిజినల్ మెమోస్, సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సంబంధించి గైడ్ లైన్స్, చెక్ లిస్ట్ లను అన్ని జిల్లాలకు పంపుతామని చీఫ్ సెక్రటరి తెలిపారు. ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్ ను ఆదేశించారు. ఇప్పటికే జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ ప్రకటించారు.  19, 20 తేదిల్లో సర్టిఫికెట్ల పరిశీలన, డిసెంబర్ 25 న అపాయిట్ మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత తొందరలో అన్ని సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటామని అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ ముందుగా జనవరిలో 10 వరకు పూర్తి చేయాలని భావించారు. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా అదే తేది వరకు పూర్తి చేయవలసి ఉండడంతో వీరిని ముందుగా తీసుకుంటే పని భారం తగ్గుతుందనే ఆలోచనతో ముందస్తుగానే సన్నాహాలు చేస్తున్నారు.

పంచాయతీ కార్యదర్శుల నియామక ప్రక్రియ పై నిరుద్యోగులు, ఓయూ జేఏసీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష ప్రశ్నాపత్రంను బయటికి ఇవ్వలేదని, కీ పేపర్ కూడా లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణ కూడా తొందరగా నిర్వహించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మెరిట్ లిస్ట్ పెడితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. నియామక ప్రక్రియ పై అనుమానాలు ఉన్నాయని అందరి మార్కుల వివరాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల భర్తీలో లోలోపల ఏదైనా జరుగుతుందన్న అనుమానాలు ఉన్నాయని వెంటనే ప్రక్రియని ఆపాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

పరీక్ష నిర్వహించేటప్పుడే పరీక్ష తీరుపై నిరసన తెలిపితే పట్టించుకోకుండా పరీక్ష నిర్వహించారని వారు విమర్శించారు. 9355 పోస్టుల ఉద్యోగాల భర్తీకి ఇంత రహస్యం పాటించాల్సిన అవసరమేముందని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రూప్స్ కు కూడా లేని నిబంధనను అమలు చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. తక్షణమే ఈ నియామకపు ప్రక్రియను ఆపి వెంటనే అందరి మార్కుల వివరాలు ప్రకటించిన తర్వాతనే నియామక ప్రక్రియ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.