ఏపీలో ప్రస్తుత రాజకీయాలు, రాబోయే ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ పుణ్యమానికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి చేపట్టిన గోనె ప్రకాశ రావు స్పందించారు. ఎలా సర్వే చేశారో తెలియదు కానీ.. తనకొచ్చిన కలను, ఊహను బహిరంగంగా ప్రకటించేశారు. పైగా తాను ఉంటున్న తెలంగాణ రాజకీయాలపై నోరు మెదిపే సాహసం చేయని ఆయన… ఏపీలో ఏమి జరగబోతుందనే విషయంపై మాత్రం తన ఊహకు పనిచెప్పారు. ఫలితంగా నెటిజన్ల కామెంట్లకు బలవుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ నేతగా ఉండి కూడా.. తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పారు గోనె ప్రకాష్ రావు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆయన మాటలకు విలువ పోయిన పరిస్థితి. ఇదే సమయంలో 2004 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ గెలవరని మరోసారి జోస్యం చెప్పారు గోనె ప్రకాష్‌రావు. విచిత్రం ఏమిటంటే… ఆ ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజారిటీతో కేసీఆర్ గెలిచారు. దీంతో… ఆయన మనసులో మాటను జోస్యంగా, సర్వే రిపోర్ట్ గా చెప్పి ఆనందిస్తారే తప్ప… గోనె మాటలకు శాస్త్రీయత శూన్యం అని ఒక నమ్మకానికి వచ్చేశారు తలంగాణ ప్రజానికం.
ఈ క్రమంలో అలాంటి పేరే ఏపీలోనూ, ఏపీ ప్రజల దృష్టిలోనూ సంపాదించాలని భావించారో ఏమో కానీ… 2024 లో ఏపీలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు.. ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయనేదానిపై ఒక గాసిప్ వదిలారు. అవును… వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీదే అధికారమని తెలిపిన ఆయన.. జనసేన, టీడీపీకి కలిపి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అక్కడితో ఆగని ఆయన… ఒంటరిగా పోటీచేసినా కూడా టీడీపీకే 100 సీట్లు వస్తాయని చెప్పేశారు.
ఇక జగన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసేశారు గోనె. జగన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశమే లేదని, జరిమానాలు మాత్రమే కడతారంటూ మరో జోస్యం కూడా చెప్పారు. దీంతో… తనను ఎవరూ పట్టించుకోవడం లేదని గోనె ఇలాంటి సర్వేలు చేస్తున్నారని.. ఊసుపోక తనను రాజకీయంగా మరిచిపోవడంపై లెక్కలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని.. ఆయన మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నది అన్ని పార్టీల నేతలు చెబుతుండటం గమనార్హం!
