13 లక్షల కోట్ల రూపాయల మేర అవగాహనా ఒప్పందాలు కుదిరాయని ‘జీఐఎస్’ విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. సరే, ఈ తరహా ‘సమ్మిట్స్’ వల్ల ఒరిగేదేంటి.? అన్నది వేరే చర్చ. కానీ, ఇప్పుడే కదా సమ్మిట్ జరిగింది.. ఓ నాలుగైదు నెలలైనా ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి కదా.
ఆ మాత్రం ఇంగితమే వుంటే, అవి విపక్షాలెలా అవుతాయి.? గతంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ తమ హయాంలో జరిగిన సమ్మిట్లు.. ఈ క్రమంలో జరిగిన ఒప్పందాలు.. వాటి ఫలితాల గురించి మాత్రం మాట్లాడదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన సమ్మిట్.. అదీ జస్ట్ రెండ్రోజుల క్రితం జరిగిన సమ్మిట్ ఫలితాలు వెంటనే వచ్చెయ్యాలి.! ఇదెక్కడి పంచాయితీ.
కాదేదీ రాజకీయానికి అనర్హం.. అన్నట్లు, రాజకీయాల్లో విమర్శలుంటాయి. ప్రతిదానికీ విమర్శ వుండొచ్చు. కానీ, కాస్తంత నైతికత వుండాలి కదా.? బాధ్యత కొంచెమైనా వుండాలి కదా.? టీడీపీ విమర్శలు, జనసేన విమర్శలు.. వాటికి వైసీపీ ఎదురుదాడి.. వెరసి, రాజకీయ రచ్చ పీక్స్‌లో నడుస్తోంది.
జరిగినవి అవగాహనా ఒప్పందాలు మాత్రమే. అవి ముందుకు నడవాలంటే చాలా పెద్ద కథే వుంటుంది. జరిగిన ఒప్పందాల్లో పది శాతం కార్యరూపం దాల్చినా చాలా చాలా గొప్ప విషయం. అలా అవి కార్యరూపం దాల్చాలంటే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా కొంత అనుకూలంగా వుండాలి. కానీ, ఈలోగా రచ్చని తారాస్థాయికి తీసుకెళుతున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలకి. తద్వారా ఇలాంటి సమ్మిట్లు ఖర్చు దండగ వ్యవహారాలుగా మిగిలిపోతాయంతే.