గంటా వైసీపీలోకి దూకేస్తున్నారట.. మంత్రి అవంతి సంగతేంటట.!

Ganta Srinivas Rao ready to leave TDP
Ganta Srinivas Rao ready to leave TDP
గంటా వైసీపీలోకి దూకేస్తున్నారట.. అవంతి సంగతేంటట.!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారట. గంటా విషయమై వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా శ్రీనివాసరావు గతంలోనే వైసీపీ ముందు కొన్ని ప్రతిపాదనలు చేశారనీ, ఆయన వైసీపీలోకి రావడానికి సిద్ధంగా వున్నారనీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీలోకి ఎవరు వచ్చినా, పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయాల్సి వుంటుందన్న విజయసాయిరెడ్డి, గంటా చేరికపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

అయితే, గంటా శ్రీనివాసరావు విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఒకింత గుర్రుగా వున్నారు. ఆ కారణంగానే గంటా, వైసీపీలో చేరడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటాపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేసే అవంతి శ్రీనివాస్, ఈ మధ్య విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా ఆయనతో కలిసి వేదికను పంచుకోవడం… ఈ ఇద్దరు పాత మిత్రుల్నీ వామపక్షాలకు చెందిన నేత కలపడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ఆ సంగతి పక్కన పెడితే, గంటా వైసీపీలో చేరతారని విజయసాయిరెడ్డి ప్రకటించడంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చివరి నిమిషం వరకూ ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై గందరగోళం నెలకొనడం అప్పట్లో గంటా వర్గీయుల్ని ఆందోలనకు గురిచేసింది. అయితే, గంటా కూడా వైసీపీలో చేరేందుకు ప్రయత్నించి, సఫలం కాలేకపోయారు. గంటా, అవంతి.. ఇద్దరూ వైసీపీలోకి వెళ్ళేందుకు అప్పట్లో చర్చలు జరపగా, అవంతికి లైన్ క్లియర్ అయ్యిందిగానీ.. గంటా శ్రీనివాసరావుకి లైన్ క్లియర్ అవలేదు.

వైసీపీ వేవ్‌లో కూడా గంటా విజయం సాధించడం గమనార్హం. అయినప్పటికీ, గంటా తెలుగుదేశం పార్టీలో ఆ తర్వాత కీలకంగా వుండలేకపోయారు. బీజేపీ సహా, ఇతర పార్టీలతో చర్చించినా ఆయన పార్టీ మారే విషయమై ముందడుగు వేయలేకపోయిన సంగతి తెలిసిందే. మరి, వైసీపీ నుంచి గంటాకు ఎలాంటి హామీ వచ్చిందోగానీ.. జీవీఎంసీ ఎన్నికల వేళ గంటా, వైసీపీలో చేరతారని వైసీపీ నేతలే ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా, గంటా ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ ఈ రోజు వైసీపీలో చేరడం కొసమెరుపు. గంటా వైసీపీలో చేరితే, మంత్రి అవంతి పరిస్థితేంటి? గంటా వెనుక వున్న కింది స్థాయి నాయకుల బలంతో పోల్చితే, మంత్రి అవంతి వెనుక నడిచే నాయకులు తక్కువ కావడంతో.. గంటా డామినేషన్ వైసీపీలో అవంతి మీద ఎక్కువే వుండబోతోందన్నది విశాఖ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చల సారాంశం.