ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీల నడుమ హోరాహోరీ యుద్ధం జరుగుతోంది. అన్ని మార్గాల్లోనూ కొట్లాడుకుంటున్నారు ఇరువురు. జగన్ ఏమో టీడీపీ నుండి ఎమ్మెల్యేలను పక్కకు లాగేసే ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు ఏమో పోతున్నవారిని ఆపుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా విశాఖ ఎమ్మెల్యేల విషయంలో ఇరుపార్టీల నడుమ ఉత్కంఠ నడుస్తోంది. గంటా శ్రీనివాసరావు విషయంలో ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. పవర్ పాలిటిక్స్ అలవాటున్న గంటా ఏమో అధికారంలేని టీడీపీలో ఉండలేకపోతున్నారు. అందుకే వైసీపీలో చేరాలని, చేరి మంత్రి పదవి పొందాలని ఆశపడుతున్నారు. అయితే ఆయన ఆశకు చాలానే అడ్డంకులున్నాయి. అవి కూడ వైసీపీలో కీలక నేతలు రూపంలోనే ఉన్నాయి.
అవంతి శ్రీనివాస్, విజయసాయిరెడ్డి లాంటి వారిని మేనేజ్ చేయడం గంటాకు చాలా కష్టంగా మారింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కన్విన్స్ అయినట్టే అయి చివర్లో అడ్డం తగులుతున్నారు. జగన్ కు గంటాను పార్టీలోకి రానివ్వడం సమ్మతమే అయినా ఇప్పటికీ గంటా వెళ్లలేకపోతున్నారు అంటే వైసీపీలో ఆయనకు వ్యతిరేకంగా ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇటీవల విశాఖలో గంటాకు చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ప్రహరీ గోడలు కూలదోసి అది ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు పెట్టేసింది. ఈ పరిణామంతో ఇక గంటా వైసీపీ వైపు కన్నెత్తి చూడరని అందరూ భావించారు. కానీ గంటాలో మాత్రం ఆశలు చావలేదు.
నిన్న తిరుమల వెళ్లిన ఆయన జగన్ మీద ఏ టీడీపీ నాయకుడూ చేయని పొగడ్త చేశారు. జనానికి మంచి చేయాలనే ఉద్దేశ్యం జగన్ కు ఉందని మాట్లాడారు. సాధారణంగా గంటా టీడీపీలోనే ఉండాలి అనుకుంటే జగన్ కు అలాంటి కాంప్లిమెంట్ ఇవ్వరు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని, టీడీపీ గొంతు నొక్కేస్తున్నారని విరుచుకుపడేవారు. సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన ఆయన టీడీపీ మీద విమర్శలేమైనా చేశారా అంటే అదీ లేదు. చంద్రబాబు నాయుడు గురించి కూడ హుందాగానే మాట్లాడారు. అసెంబ్లీలో అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా జగన్, చంద్రబాబు ఇద్దరి గురించి మంచిగానే మాట్లాడిన ఆయన తీరు చూస్తే ఆయన ఎటువైపు ఉన్నారనేది అర్థంకాని మిస్టరీ అయిపోయింది.
పార్టీ తరపున సమావేశాలకు హాజరై పాలక వర్గం మీద పోరాడాలి. కానీ ఆయన సమావేశాలకే వెళ్ళలేదు. అలాగని టీడీపీ మీద విముఖుతతో ఉన్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు నాయుడు గురించి మంచిగానే మాట్లాడారు. అలాంటప్పుడు తన ఆస్తులను జప్తు చేసిన వైసీపీ ప్రభుత్వం మీద ఆయనకు కోపం ఉండాలి కదా. అదీ లేదు. జగన్ గురించి బాగానే మాట్లాడారు. ఇలా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ఎటు శ్రేయస్కరమో అటు దూకేద్దామనుకుంటున్న గంటా చివరికి ఏం చేస్తారనేది ఇరు పార్టీల అధినేతలకు అంతుబట్టట్లేదు.