చెత్త బండిలో వినాయక విగ్రహాలు.. అసలేం జరుగుతోంది.?

 

అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రీతిలో.. ఆ మాటకొస్తే, అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కుల, మత రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యమా.? లేదంటే, ఇంకేదన్నా కారణమా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ‘హిందూ మతం’ ప్రతిసారీ టార్గెట్ అవుతూ వస్తోంది.. కొందరి కారణంగా. కేవలం హిందూ దేవాలయాల మీదే దాడులు జరుగుతున్నాయి.. హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు, కొన్ని దేవాలయాలకు చెందిన రధాలు దగ్ధమవుతున్న ఘటనలు పెను దుమారానికి కారణమవుతున్నాయి. ఆయా ఘటనల్లో చాలా వేగంగా స్పందించామని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని కేసుల్లో నిందితులు దొరుకుతున్నా, చాలా కేసుల్లో నిందితులెవరో కూడా తేలని పరిస్థితి. విచ్చలవిడిగా బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయన్న ఆరోపణలకు కొదవే లేదు. ఇలాంటి తరుణంలోనే వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడం కొత్త వివాదానికి కారణమయ్యింది. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే ఓ అధికారి, వినాయక విగ్రహాల్ని చెత్త బండీలోకి ఎక్కించడం మరింత వివాదాస్పదమయ్యింది.

ఉన్నతాధికారులు స్పందించి, సదరు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ని విధుల నుంచి తప్పించారనుకోండి.. అది వేరే సంగతి. అయితే, ఈలోగానే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది వైఎస్ జగన్ ప్రభుత్వానికి. రోడ్డు పక్కన విక్రయానికి సిద్ధంగా వుంచిన వినాయక విగ్రహాల్ని చెత్త బండిలోకి ఎక్కించి తరలించడమేంటి.? అన్నది హిందుత్వ వాదుల ప్రశ్న. నిజానికి, ఇది హిందువుల నుంచి మాత్రమే వస్తున్న ప్రశ్న కాదు.. సామాన్యులందరూ ఇదే ప్రశ్నని సంధిస్తున్నారు. గుంటూరులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ఇంత హేయమైన చర్యకు సదరు ప్రభుత్వోద్యోగి పాల్పడటానికి కారణమేంటి.? ఎవరి మెప్పు పొందడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగి ఇంతటి దారుణానికి తెగబడ్డాడు.? అన్న విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి లింకుపెట్టి ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ది కోసం విపక్షాలు ప్రయత్నించడం సహజమే. కానీ, వారికి ఆ అవకాశమిస్తున్నదెవరు.?