టిడిపి అవిశ్వాస ప్రసంగం: గల్లా జయదేవే యోగ్యుడు

ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ప్రారంభిస్తారని ప్రకటించడం పార్టీలో బయట చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని టిడిపిపి నాయకుడికి గాని, ఇతర సీనియర్లుకు గాని ఇవ్వలేదు. గల్లా జయదేవ్ కు మాత్రమే ఇచ్చారు. ఇది సరైన నిర్ణయమని వేరే చెప్పనవసరం లేదు. చక్కగా, ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడి, పార్లమెంటు చర్చల్లో పాల్గొన గలిగే ఎంపిలు తెలుగుదేశంలో చాలా తక్కువ. ఉంటే గింటే ఒక్క అశోక్ గజపతి రాజు పేరు చెప్పు కోవాలి. ఆశోక్ ది సుతిమెత్తని శైలి. ఉర్రూత లూగించే శక్తి యుక్తులు , వాదనా పటిమ, ఆయనకు లేదు. ఇక మిగతా వాళ్లంతా,  ప్లకార్డులు పట్టుకుని, సభ నడవలోకి పరిగెత్తి కార్యకలాపాలు అడ్డుకోవడంలో దిట్టలు. (ఇది కూడా గొప్ప క్వాలిటీయే. జయదేవ్ ఈ పనికి పనికే రాడు). లేదా వాళ్ల వూర్ల బహిరంగ సభలలో గట్టిగా మాట్లాడి ఈలలు చప్పట్లు పొందవచ్చు. పార్లమెంటులో ఉపన్యాసం అలా ఉంటే… అంతే సంగతులు.

 

పార్లమెంటులో ఆవిశ్వాసం తీర్మానం మీద చర్చప్రారంభించడమంటే అల్లాటప్ప వ్యవహారం కాదు, మనుసులో ఉన్న భావాన్ని,పార్టీ ధోరణిని అందరికి అర్థమయ్యేలా, గుచ్చుకునే బాకుల్లా వదలాలి. చురకలేయాలి, ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. గొడవలు చేసినా చెక్కుచెదరకుండా ఉండాలి. చెప్పాల్సిందంతా, పొల్లుపోకుండా చెప్పాలి. ఉన్నదున్నట్లు చెప్పాలి.

చాలా కాలం కిందట వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినపుడు కాంగ్రెస్ నాయకుడు ఎస్ జైపాల్ రెడ్డిని ప్రారంభోపన్యాసం చేయాలని పార్టీ నియమించింది. జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్. బాగా చదువుకున్నవాడు. తలలో మేకులు దిగగొట్టినంత నొప్పివచ్చేలా ప్రభుత్వాన్ని చీల్చిచెండాడగలడు, భాషలోనూ భావంలోనూ. ఆయనకు భాష మీద ఉన్న పట్టు ఆపారమయినది. అంతే వాదనా పటిమ ఉన్నవాడు. విపరీతమయిన చదవరి. జైపాల్ రెడ్డి రాజకీయజీవితంంలో అత్యుత్తమ ఉపన్యాసం అదే. జైపాల్ రెడ్డి దాడితో వాజ్ పేయి కంగుతిన్నాడు. కంగారుపడ్డారు. చివరకు జైపాల్ అంగవైకల్యంగురించి ప్రస్తావించి అభాసు పాలయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి జైపాల్ తర్వాత అంతటి వక్త ఇంకా రాలేదు. జైపాల్ కు ధీటయిన వాడు కాకపోయినా, గల్లాదేవ్ కు మంచి పార్లమెంటేరియన్ లక్షణాలున్నాయి. అనవసరంగా ఆవేశంకాకుండా, లోతయిన చర్చకు బాటవేసేలా రేపు ఆవిశ్వాసం తీర్మానం మీద చర్చ ప్రారంభించాలి. దీనికి యోగ్యడెవరయినా ఉన్నారంటే జయదేవే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. తెలుగుదేశం ఎంపిలలో ఇతరత్రా స్కిల్స్ ఉన్నవారు ఉండవవచ్చు. కాని అవిశ్వాసం తీర్మానం పైలట్ చేయగల సత్తా జయదేవ్ కు మాత్రమే ఉంది. ఆయన తొలిసారి ఎంపి కావచ్చు, చాలాసార్లు, ఆయన అనేక సార్లు గెల్చిన ఎంపిలకంటే, చక్కగా మాట్లాడి సభ కంట పడ్డారు. ఇది పోటీ వ్యవహారం కాదు. తెలుుదేశం పార్టీ లైన్కి, ఆక్రోషానికి, అసంతృప్తికి వాగ్రూపం ఇవ్వాలి. ఇలాంటి కీలకమయిన ఉపన్యాసావకాశాన్ని ఇతర కారణాలతో ఇతరులెవరికిచ్చినా పార్టీ అభాసు పాలుకాకతప్పదు.అందువల్ల ముఖ్యమంత్రి జయదేవ్ పేరు చెప్పడం సబబు. సరైననిర్ణయం. ఇది ఎవరో అసంతృప్తి చెందాల్సిన విషయం కాదు. పార్టీ పరువు సమస్య.

జయదేశ్ గతంలో చేసిన అనేకప్రసంగాల పట్ల అంతా సంతృప్తి చెందారు. ఆయన అందరి దృష్టి ఆకర్షించారు. ఆమధ్య ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ గురించి ఒక జాతీయ చానెల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడి ఒక నాయకుడు పార్టీ పరువు తీసిన సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. అడ్దమయిన వాళ్లు నేషనల్ చానెళ్ల చర్చలకు వెళ్లవద్దని, ఒక్క జయదేవ్ మాత్రమే ఆ వ్యవహారాన్ని చూసుకుంటూరని ముఖ్యమంత్రి ఎపుడో స్పష్టం చేశారు.

ఈ ఏడాదిలోనే లోక్ సభలో రాష్ట్ర పతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జయదేవ్ ప్రసంగించి, రాష్ట్ర విభజన జరిగిన తీరుమీద తెలుగుదేశం పార్టీ ధోరణినిని చాలా గొప్పగా చెప్పి ప్రశంసలందుకున్నారు. ఆ ఉపన్యాసానికి విపరీతమయిన గుర్తింపు వచ్చింది. ఆయనమాట్లాడిన తీరు, ప్రస్తావించిన అంశాలు, సభ ముందు పెట్టిన వివరాలు, అన్నింటికంటే ముఖ్యంగా లేవదీసిన వాదన చాలా పటుత్వంతో ఉండింది. ఆ ఉపన్యాసం విన్నాక, అవిశ్వాస తీర్మానం వంటి కీలకమయిన ప్రసంగం చేసే అవకాశం ఆయనకు కాకుండా మరొకరికి ఇవ్వాలన్న అభిప్రాయం ఎవరికీ రాదు. తీర్మానం వీగిపోవచ్చు, ఆపైన బిజెపి సభలో కాలర్ ఎగురేయవచ్చు, అయితే టిడిపి సభ్యుడు ఏమిచెప్పాడనేది,ఎలాచెప్పాడనేది రికార్డులలోనేకాదు, చూపరుల మైండ్ లో కూడా శాశ్వతంగా ఉండిపోవాలి. వోడినా గెలిచినంత హ్యీపీగా బయటకు రావాలి.