సినీ నటుడు అలీ, 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన విషయం విదితమే. అంతకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో వుండేవారు. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అలీకి, చంద్రబాబు నుంచి ఆ విషయమై సానుకూల స్పందన రాలేదు. దాంతో, ఆయన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి పోటీ చేయాలనుకున్నారుగానీ కుదరలేదు.
గడచిన మూడున్నరేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంలో పదవి కోసం ఎదురుచూసీ చూసీ.. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు కూడా. జనసేనలోకి అలీ వెళ్ళబోతున్నారంటూ ప్రచారం జరిగింది. జనసేనానితో అలీ రహస్య భేటీ కూడా జరిగిందట. ఈ విషయం తెలిశాక, వైసీపీ నుంచి ఆయనకు కబురు అందిందనీ, వైసీపీ పెద్దలు ఆయనతో చర్చలు జరిపారనీ అంటారు.
అలీని వదులుకుంటే పార్టీకి నష్టమేనన్న భావనలో వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన కోసం ‘ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు’ అనే నామినేటెడ్ పోస్ట్ ఖాయం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రెండేళ్ళపాటు ఆయన ఆ పదవిలో వుంటారు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలహాదారులు చేస్తున్న పని ఏంటి.? వారి సలహాల వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ‘ఖర్చు దండగ వ్యవహారం’ అంటూ సలహాదారుల విషయమై తీవ్రాతి తీవ్రమైన విమర్శలున్నాయి. సలహాదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తుంటారు.
ఇంతకీ, అలీ చేయబోయే పనులేంటి.? ఈ విషయమై స్పష్టత లేదు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు మాత్రమే.. అంటే, అది అర్థం పర్థం లేని పోస్ట్.. అనే చర్చ అలీ సన్నిహితుల్లోనూ జరుగుతోందట.