పార్టీల మధ్యన వలసలు అనేవి సర్వ సాధారణం. గతంలో వీటిని అన్ని పార్టీలు బాగా ప్రోత్సహించేవి. సొంత పార్టీకి ఘలక్ ఇచ్చి తమవైపుకు వచ్చే వారికి ఆ పార్టీ అధినేతలు మంచి ప్రయారిటీ ఇచ్చి సంతృప్తిపరిచేవారు. 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి జంప్ చేసి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొందరికి చంద్రబాబు మంత్రి పదవులు ఇవ్వడం కూడ జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. అయితే జగన్ మొదటి నుండి వలసలకు వ్యతిరేకంగానే ఉన్నారు. 2014 తర్వాత జరిగిన పరిణామాలు ఆయనకు వలస నేతలంటే ఒళ్ళు మండేలా చేశాయి. అయినా కూడ చంద్రబాబును దెబ్బకొట్టడం కోసం అనధికారిక వలసలకు తెరతీశారు ఆయన. వచ్చేవారు ఎవరైనా సరే రాజీనామాలు చేసి రావాల్సిందే అంటూ షరతు పెట్టి అనధికారికంగా మద్దతు తీసుకున్నారు.
అయితే ఎన్నికల్లో ఓడిన నాయకులకు మాత్రం గేట్లు తెరిచేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీచేసి ఓడినపోయిన నాయకులు వివిధ కారణాల రీత్యా వైసీపీలో చేరారు. జూపూడి ప్రభాకర్ రావు, శిద్ధారాఘవరావు, పంచకర్ల రమేష్ బాబు, తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శమంతకమణి, దేవినేని అవినాష్, కదిరి బాబూరావు, ఇంకా చోటా మోటా నాయకులు కొందరు టీడీపీకి బైభై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు ఎన్నికల్లో గెలవకపోయినా బలమైన నేతలే. మంచి పలుకుబడి, కేడర్ కలిగిన వారు. అందుకే వారిని వదులుకోవడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టంలేదు. వారిని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి వదులుకున్నారు. చంద్రబాబును కాదని ఏదో సెక్యూరిటీ, భవిష్యత్తు మీద భరోసా ఆశించి వెళ్లిన సదరు లీడర్లు ఇప్పుడు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
టీడీపీ నుండి గెలిచి బయటికొచ్చిన వారికే వైసీపీలో దిక్కు మొక్కూ ఉండటం లేదు. స్థానిక వైసీపీ నాయకులు, క్యాడర్ ఎవ్వరూ సహకరించట్లేదు. పనులూ జరుపుకోలేకపోతున్నారు. ఇక వీరికి జగన్ అపాయింట్మెంట్ కూడ ఇవ్వట్లేదు. అలాంటిది పదవి లేని వారి సిట్యుయేషన్ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. వీరిలో ఒక్క దేవినేని అవినాష్ మినహా మిగతా ఎవ్వరూ హ్యాపీగా లేరు. పదవి లేదు పార్టీలో ప్రాముఖ్యత లేదు. వైసీపీ నేతలు వీరిని చాలా తక్కువగా చూస్తున్నారు. పార్టీలో చేరారన్న పేరే కానీ ఇళ్లకు, సొంత పనులకే పరిమితం కావాల్సి వస్తోంది. వైసీపీలో ఉండే గల్లీ లీడర్లు కూడా వీరిని లెక్కచేయట్లేదట. ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసి ఇప్పుడు బచ్చా లీడర్ల వెనుక తిరగాల్సి వస్తోందే అనుకుంటూ కుమిలిపోతున్నారట.
ఎంత వారించినా వినకుండా పార్టీని వీడి ఇప్పుడు కష్టాలు పడుతున్న వారిని చూసి టీడీపీ నేతలు మాకు అధికారం, పదవులు లేకపోవచ్చు.. కానీ చంద్రబాబు దగ్గర ఒక విలువ ఉంది. బాబుగారికి వెన్నుపోటు పొడుస్తారా.. అనుభవించండి అనుకుంటున్నారు. వెళ్ళిపోయినా వారంతా పార్టీలోనే గనుక ఉండి ఉంటే చంద్రబాబు వారికి తప్పకుండా ఏదో ఒక కీలకమైన పోస్ట్ ఇచ్చేవారే. నియోజకవర్గాల పగ్గాలు అప్పగించి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని మాటిచ్చేవారు. కానీ అవేవీ పట్టించుకోకుండా వెళ్ళిపోయినా వారంతా వైసీపీలో ఏకాకులై పోయారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి టీడీపీ గూటికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.