సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ కేసీఆర్ సర్కార్ పై అనూహ్య వ్యాఖ్యలు చేసారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందపల్లిలో ఒక ప్రయివేటు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. టీఆరెస్ అమలు చేసిన పథకాల గురించి, ఆయన ఉద్యోగ విరమణకు సంబంధించిన అంశాల గురించి విలేఖరులతో పంచుకున్నారు. ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే కింద ఉంది చదవండి.
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భీమా, రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలకు చాలా ఉపయోగకరమైనవని ఆయన తెలిపారు. శ్రీకృష్ణ దేవరాయలు, కాకతీయుల నాటి సమయంలోనే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువులను నిర్మించి పంటలకు సాగు నీరు అందించేందుకు కృషి చేసారని వివరించారు. అలాంటి చెరువులను అభివృద్ధి చేసి నీటి నిల్వలను పెంచేలా మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ చేపట్టడం గొప్ప నిర్ణయమని అభినందించారు.దీనితో ఆయన కూడా కెసియార్ అభిమానుల జాబితాలో చేరిపోయినట్లయింది. జనసేననేత పవన్ కల్యాణ్ ఎపుడో కెసియార్ అభిమానిగా మారిపోయారు. ఆయన ఎంతగా కెసిఆర్ పాలనను అభినందిస్తున్నారంటే, తెలంగాణలో జనసేన సేన అవసరమేలేదని ఫీలవుతున్నారు.అందుకే తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఇపుడు లక్ష్మినారాయణ కూడా కెసియార్ కు ఇలా కితాబివ్వడం, అందునా ఎన్నికల సమయంలో… గొప్పవిషయంగా చెప్పుకుంటున్నారు.
వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తేనే అభివృద్ధి కీలకమని లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు. సాగు రంగం అభ్యున్నతి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని జేడి పేర్కొన్నారు. “వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పని చేసేందుకు తనకు అవకాశం కల్పించనందువల్లే ఏడేళ్లు ముందుగానే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసానని వెల్లడించారు.
గత కొద్దీ రోజులుగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన టీడీపీలో చేరుతారంటూ, ఎంపీ గా పోటీ చేస్తారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. గతంలో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. కాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంతా అవాస్తవమని స్పష్టత ఇచ్చారు. అవసరమైన సమయంలో తనవంతు పాత్ర పోషిస్తానని వెల్లడించారు.