కేంద్రంలోని బీజేపీ పెద్దలు జగన్ స్నేహాన్ని కోరుకుంటున్నారని కథనాలొస్తున్నాయి. రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం హస్తినలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎంపీలను జగన్ సాయం చేస్తారనే ఆశ బీజేపీ పెద్దలకు బలంగా ఉంది. మరోపక్క ఏపీలో జగన్ సర్కార్ పై ఏపీబీజేపీ నేతలు తెగ విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని జగన్ సర్కారుపై అదే పనిగా విరుచుకుపడుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పు పడుతున్నారు. ఈ సమయంలో అందుకు భిన్నంగా స్పందించారు తెలంగాణ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు తీరును తప్పు పడుతూ.. అదే సమయంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జీవో111 ను రద్దు చేస్తూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ఈటల రాజేందర్.. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ సరైన పనులు చేయలేదని, అర్హులపై పేదలకు కాకుండా పార్టీ జనాలకు పంచిపెడుతున్నారని విమర్శలు చేశారు. ఈ సమయంలో… పక్క రాష్ట్రంలోని జగన్ సర్కారు పేదల కోసం లక్షలాది ఇళ్లు నిర్మిస్తుందంటూ సంచలన కామెంట్లు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం లక్షలాది ఇళ్లు నిర్మించి ఇస్తున్నారన్న ఈటెల.. కేసీఆర్ సర్కారు మాత్రం డబుల్ బెడ్రూంలతో సహా పేదలు ఇళ్లు నిర్మించేందుకు ఒక్క గజం జాగాను ఇవ్వట్లేదన్నారు. ఇదే సమయంలో… తాను చెబుతున్న విషయాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా… ధరణి తప్పుల్ని సరిదిద్దేందుకు 18 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడూ ఈ వ్యాఖ్యలు తెలంగాణలో కంటే ఏపీలో వైరల్ గా మారాయి. దీంతో కీబోర్డులకు పని చెబుతున్న వైసీపీ సోషల్ మీడియా జనాలు… ఏపీ బీజేపీ నేతలకు ఈటల మాటలను షేర్ చేస్తున్నారు. కళ్లుండీ చూడలేని స్థితిలో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారని.. తెలంగాణ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను ఒకసారి అర్ధం చేసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. పక్కరాష్ట్రంలోని నేతలకు కనిపిస్తున్న విషయం ఏపీలోని బీజేపీ నేతలకు కనిపించకపోవడం దారుణం అని చెబుతున్నారు.