ఏపీలో ముందస్తు ఎన్నికలు??

తెలంగాణాలో ముందస్తు ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అని కొందరు సందేహిస్తున్నారు. మరి ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా? అంటే వస్తాయి అని గట్టిగా చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పుడు జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

మంగళవారం విశాఖలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ జగన్ ముందస్తు గురించి వ్యాఖ్యానించారు. అంతేకాదు జనవరి చివరికే శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఇందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో నవరత్నాల పోస్టర్ ని ఆవిష్కరించారు జగన్. ఈ సందర్భంగా… నవరత్నాల పధకం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. పార్టీ విజయానికి ఇదే కీలకం అని నేతలకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుండి “రావాలి జగన్…కావాలి జగన్” కార్యక్రమాన్ని ప్రారంభించాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

ప్రతి నియోజకవర్గంలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లను అధికంగా తొలగించినట్లు పక్కా సమాచారం ఉందని వెల్లడించారు. ముస్లిం మైనారిటీలవి, క్రిస్టియన్లవే ఎక్కువ సంఖ్యలో తొలగించినట్లు తెలుస్తోందన్నారు. ఎవరి ఓట్లైనా అన్యాయంగా తొలగిస్తే కార్యకర్తలు వాటిని తిరిగి చేర్పించాలని అన్నారు.

ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటాను అని చెప్పిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇప్పటి వరకు ఆయన వైసీపీ ముఖ్యనేతల సమావేశాలకు హాజరవుతూనే వచ్చారు. ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంతో ఆయన వైసీపీకి దూరం అయ్యారు అనే వార్తలకు బలం చేకూరినట్టైంది. కానీ 2019 ఎన్నికల వరకు పీకే బృందం వైసీపీకి తమ సేవలు అందిస్తుందని పార్టీ ముఖ్యవర్గాల నుండి సమాచారం.