ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలా.? ఎందుకు.?

‘మేం పూర్తికాలం అధికారంలో వుండాలనుకుంటున్నాం. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం కూడా. మాకు తగినంత సమయం వుంది. మరింతగా ప్రజలకు మేలు చేస్తాం. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ గెలుస్తాం..’

ఇదీ వైసీపీ పదే పదే చెబుతున్నమాట.! కానీ, వైసీపీలోనే అంతర్గతంగా ‘ముందస్తు ఎన్నికలపై చర్చ’ ఎందుకు జరుగుతున్నట్లు.? టిక్కెట్లు ఖరారు చేసుకునే క్రమంలో కొందరు, తమకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో వేరే పార్టీల వైపు చూస్తున్నమాట వాస్తవం.

ప్రత్యక్షంగానో పరోక్షంగానే అధికార వైసీపీనే ముందస్తు ఎన్నికల సంకేతాలు పంపుతోంది. ముందస్తు ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు. జనసేన పార్టీ పరిస్థితీ అంతే.!

‘ఇదే మంచి సమయం.. ఇప్పుడు దెబ్బ కొడితే, తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన పార్టీ కూడా సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశం లేదు..’ అన్న చర్చ వైసీపీ అధినాయకత్వం కేంద్రంగానే జరుగుతోంది.

అయితే, సాధ్యాసాధ్యాలు, బలాబలాలు.. ఇవన్నీ అంచనా వేసుకోకుండా ముందస్తుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘సానుకూల’ నిర్ణయం తీసుకునే అవకాశం వుండదు. తెలంగాణతోపాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయ్.. అన్నది ప్రస్తుతం బాగా వినిపిస్తోన్న టాక్.!