పవన్ కు ద్వారంపూడి స్ట్రాంగ్ కౌంటర్… కామెంట్స్ వైరల్!

వారాహియాత్రలో భాగంగా సర్పవరం జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి గూండా రౌడీ.. ఆయన క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోస్తానంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ద్వారంపూడి స్పందించారు.

అవును… జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. పవన్ తన నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టలేక.. కాకినాడ రూరల్‌ లోని సర్పవరం జంక్షన్ లో సభ పెట్టుకున్నాడంటూ మొదలుపెట్టిన ద్వారంపూడి… అనంతరం డోస్ పెంచారు.. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి బాగోగులు చూడటం కోసం పార్టీ పెట్టాడంటూ ఎద్దేవా చేశారు!

ఇక 2008లో పార్టీ స్థాపించిన కొత్తలో ఏదో ఉద్దరిస్తాడనుకుని ఆయనతో చేరిన మాదాసు గంగాధర్, తోట చంద్రశేఖర్, శ్రీధర్, ఎన్నారై అశోక్, రాఘవయ్య వంటి సీనియర్లు ఇప్పుడు ఎందుకు లేరని ద్వారంపూడీ ప్రశ్నించారు. అయితే గత ముఫ్ఫై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనతో… మొదటి ఉన్నవారంతా ఇప్పుడూ ఉన్నారని.. అది నిబద్దత అని ద్వారంపూడి చెప్పుకున్నారు.

చంద్రబాబుతో ప్యాకేజీ బేరం కుదరనందువల్లే మార్చి 14న ఒక మాట.. జూన్ 18న ఒక మాట మాట్లాడుతున్నాడని పవన్‌ పై ద్వారంపూడి మండిపడ్డారు. దానిఫలితంగానే రోడ్డెకి చంద్రబాబు ముందు బలనిరూపణ చేసుకుంటున్నాడన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… ఎవడో చెప్పిన కోతి మాటలు విని తనపై కోతి గంతులు వేయవద్దని ద్వారంపూడి హితవు పలికారు.

ఇక, బియ్యం వ్యాపారం తో రూ.15వేల కోట్లు తాను సంపాదించడం అబద్ధమన్న ద్వారంపూడి.. తన వద్ద అంత డబ్బు ఉంటే పవన్‌ ను కొనేస్తానన్నారు. నిజంగా తనవద్ద అంతసొమ్ము ఉంటే… చంద్రబాబు కంటే ముందు తానే పవన్ కు ప్యాకేజీ ఇచ్చి లైన్ లో పెట్టుకునేవాడినంటు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక తనది డీ బ్యాచ్ అయితే పవన్ ది ఏ బ్యాచ్ అని ప్రశ్నించరు. అనంతరం… పవన్ ది “పి” బ్యాచ్ అని… పి బ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్ బ్యాచ్చా.. ప్యేకేజీ బ్యాచ్చా.. లేక, పచ్చి బూతుల బ్యాచ్చా అంటూ ఫైరయ్యారు!

ఈ సందర్భంగా… చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో వారిద్దరినీ తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదని.. కులాల గురించి మాట్లాడను అంటూనే కులాల మధ్య పవన్‌ చిచ్చు పెట్టేలా ప్రసంగిస్తు‍న్నాడని ద్వారంపూడి మండిపడ్డారు.

అనంతరం మరింత డోస్ పెంచిన ఆయన… “ఈరోజు నుంచి నీ పతనం ప్రారంభమైంది” అని పవన్‌ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను ఓడిస్తానంటూ పవన్‌ విసిరిన చాలెంజ్‌ ను స్వీకరిస్తానని తెలిపిన ద్వారంపూడి… “నువ్వు జనసేన అధినేతవే అయితే.. నాపై పోటీ చేయ్యి.. నిన్ను తుక్కుతుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖరే కాదు.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు ఓడిపోయానా అదే పని చేయాలి..” అని పవన్‌ కు ప్రతిసవాల్‌ విసిరారు!

మరి ద్వారంపూడి విసిరిన సవాల్ పై పవన్ స్పందిస్తారా.. లేక, సర్పవరం మీటింగ్ అక్కడితో అయిపోయిందని ఆ విషయాన్ని లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!