దుష్ట చతుష్టయం సరే.! అప్పుల పాలనతో నెట్టుకొచ్చేయగలరా.?

తమ ప్రభుత్వానికి ఎక్కడ తేడా కొడుతుందో ప్రభుత్వంలో వున్నవారు, ప్రభుత్వాధినేతకు సరైన సమాచారం ఇవ్వాలి. కానీ, అలాంటివారు ప్రభుత్వంలో వున్నారా.? వుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వారు సరైన సమాచారం ఇచ్చినా, ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదా.? ఎన్నెన్నో వాదనలు మీడియా, రాజకీయ వర్గాల్లో ఈ విషయమై వినిపిస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో ‘అహో చంద్రన్న.. ఒహో చంద్రన్న..’ అంటూ టీడీపీ నేతలు కీర్తించారు. తనది చాలా గొప్ప పాలన అని చంద్రబాబు చెప్పుకున్నారు. టీడీపీ అనుకూల మీడియా కూడా అదే చెప్పింది. కానీ, 2019 ఎన్నికల్లో ఏం జరిగింది.? చంద్రబాబుని మరీ దారుణంగా ఓడగొట్టి మూలన కూర్చోబెట్టారు ప్రజలు. ఈ అనుభవం కళ్ళముందు కనిపిస్తున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు లైట్ తీసుకుంటున్నట్టు.?

సంక్షేమ పథకాల ప్రచారం లేనిదే ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించలేని రోజులివి. వాటిని నమ్మి జనం ఓట్లేస్తారని కాదు, అవి లేకపోతే ఓట్లెయ్యరేమోనన్న భయం రాజకీయ పార్టీలది. వైసీపీ కూడా ఇదే భయంతో వున్నట్టుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో అస్సలేమాత్రం తగ్గడంలేదు. ఇది నిజానికి, పులి మీద స్వారీ లాంటి వ్యవహారం.

సంక్షేమం ఆపేస్తే.. ప్రభుత్వం కూలిపోతుంది. కష్టమైనా సంక్షేమ పాలన కొనసాగించాల్సిందే. కానీ, సంక్షేమం కారణంగా రాష్ట్రం అప్పుల పాలయ్యేంతలాగనా.? చంద్రబాబు చేసింది అదే, వైఎస్ జగన్ చేస్తున్నదీ అదే. రేప్పొద్దున్న ఎన్నికల సమయంలో జనం అన్నీ బేరీజు వేసుకుంటారు.

రాజధాని, పోలవరం.. ఇలాంటి కీలక అంశాల్ని అస్సలేమాత్రం వైసీపీ సర్కారు పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. కేవలం ‘దుష్టచతుష్టయం’ అంటూ బహిరంగ సభల్లో విమర్శలు చేసేసి, చేతులు దులిపేసుకుంటామంటే అది కుదిరే వ్యవహారం కాదని వైసీపీ పెద్దలకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో.!