హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజకీయ వైఖరి ఎప్పుడూ చిత్రంగానే ఉంటుంది. తండ్రి స్థాపించిన పార్టీని వియ్యంకుడికి వదిలేసి ఎమ్మెల్యేగానే సెటిలైపోయిన ఏనాడూ ఎమ్మెల్యే పదవిని దాటి రాజకీయం చేసింది లేదు. రాజకీయంగా పూర్తిగా చంద్రబాబు నాయుడుకు అందించే బాలయ్య హిందూపురం విషయాలు తప్ప మరేమీ పట్టించుకోరు. ముఖ్యంగా పార్టీ విషయాలలో కూడా ఆయన జోక్యం అస్సలు ఉండదు. పార్టీ ఇంతటి సంక్షోభంలో ఉన్నా, టీడీపీ నేతలు అరెస్ట్ అవుతున్నా పెద్దగా నోరు మెదపలేదు. బాబుగారు సైతం అయన అలా ఉంటేనే మంచిదన్నట్టు ఉంటుంటారు. కానీ టీడీపీ నేతలు అందరిలోకి బాలయ్యకే క్రేజ్ ఎక్కువ. గత ఎన్నికల్లో అంతా బొటాబొటీ మెజారిటీతో గెలిస్తే బాలయ్య ఒక్కరే 2014 ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీని పొందారు.
హిందూపురం ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానన్న ఆయన తాజాగా హిందూపురంలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.55లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు, పరికరాలను అందజేశారు. అవి అయన సొంత ఖర్చులేనట. ఈ సంధర్భంగా మాట్లాడిన ఆయన ఎక్కడున్నా హిందూపురం అభివృద్దిని కాంక్షిస్తానని, హిందూపురంను జిల్లాగా చేయాలని, హిందూపురం మెడికల్ కాలేజ్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తానని అన్నారు. ఈమాటతో టీడీపీలో కలకలం మొదలైంది. ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ జగన్ వద్దకు వెళతాం అనలేదు. జగన్ ను ఒక ముఖ్యమంత్రిగా కంటే శత్రువగానే చూస్తూ వచ్చారు వారందరూ. దీంతో టీడీపీ నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ది కుంటుబడింది.
పాలక వర్గం, ప్రతిపక్షం మధ్యన హోరాహోరీ యుద్దం నడుస్తోంది. అరెస్టులు, కేసులు, హైకోర్టులో పిటిషన్లు, ఆరోపణలు ప్రత్యారోపణలు, పార్టీ పిరాయింపులతో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్లో బాలయ్య వెళ్ళి జగన్ ను కలుస్తానని అనడం చర్చనీయాంశమైంది. చివరికి చంద్రబాబు సైతం ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డారట. వైసీపీ ద్రుష్టిలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక ఎత్తు బాలయ్య ఒక ఎత్తు. ఎందుకంటే జగన్ కు నటుడిగా బాలయ్య అంటే ప్రత్యేక అభిమానం ఉంది. దీంతో ఇద్దరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది అనే సందేహాలు బాబులో మొదలయ్యాయి. అందుకే బాలయ్యతో ఒకవేళ జగన్ ను కలిస్తే కేవలం నియోజకవర్గ సమస్యల గురించి మాత్రమే మాట్లాడాలని, పార్టీకి, నేతలకు సంబంధించిన ఏ విషయాలను చర్చించకూడదని అన్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతోంది.