టీడీపీకి షాక్: కడపలో కలవరం

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల హడావిడి మొదలయ్యింది. నాయకులు కూడా తమకి ఏ పార్టీలో ఉంటే రాజకీయంగా లబ్ది చేకూరుతుందో ఆ పార్టీకి జంప్ చేయడానికి రెడీ అయిపోతుంటారు. ప్రస్తుతం టీడీపీపై అసంతృప్తితో ఉన్న కొందరు నేతలు పార్టీ మారే ఆలోచనలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తానని అలక పూనిన జేసీ దివాకర్ రెడ్డి..టీడీపీ అధినేత చంద్రబాబుని కలిశాక ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జి కన్నబాబు పార్టీని వీడినట్లు తెలుస్తోంది.

ఈ తరుణంలోనే రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి కూడా వైసీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. మేడా పార్టీ మారబోతున్నారనే వార్త టీడీపీలో కలవరం రేపుతోంది. ఆయన పార్టీ మారడంపై వైసీపీ పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపినట్టు చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. మేడా అసంత్రుప్తిపై కారణం తెలుసుకుని బుజ్జగించేందుకు టీడీపీలో బడా నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వారి జోక్యంతో పార్టీ మారే ఆలోచనను మేడా విరమించుకున్నట్టు సమాచారం. సోదరుడు తెస్తున్న ఒత్తిడి కారణంగానే వైసీపీలోకి వెళ్ళటానికి చర్చలు జరిపారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సీఎంను కలిసేందుకు సచివాలయం చేరుకున్నారు మేడా మల్లిఖార్జునరెడ్డి.