తెలంగాణ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని అవమానభారంతో ఆత్మహత్యకు యత్నించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం  ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామానికి చెందిన శ్యాం కుమార్ ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు. ప్రిలిమ్స్ ఫలితాలలో శ్యాంకుమార్ ఎంపిక కాలేదు. శ్యాం కుమార్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. శ్యాం కుమార్ కు గ్రూప్స్ వైపు ఇంట్రస్ట్ ఉండటంతో గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాడు. అయితే గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదల కావడం ఆలస్యం కావడం, వచ్చిన పోస్టులు కేవలం తక్కువగా ఉండటంతో తప్పని సరి పరిస్థితిలో శ్యాం కుమార్ కానిస్టేబుల్ కు అప్లయ్ చేశాడు.

కానిస్టేబుల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో  శ్యాంకుమార్ అవమాన భారంగా భావించాడు. ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. శ్యాంకుమార్ పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. గ్రూప్స్, సివిల్స్ సాధించాలని చెబుతూ శ్యాం కుమార్ తమ వద్ద ఎప్పుడూ బాధపడేవాడని తోటి స్నేహితులు తెలిపారు.

సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకురావడంతో శ్యాంకుమార్ ప్రాణాలకు ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్ధి సంఘాల నేతలు, నిరుద్యోగ సంఘాల నాయకులు శ్యాంకుమార్ ను ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల నియామకం జరపలేదని వారు విమర్శించారు. లక్ష ఉద్యోగాలని చెప్పి మాటతప్పారన్నారు. కేవలం ఎక్కువ మంది కాంపిటేషను లేని ఇంజనీర్, కరెంట్ డిపార్ట్ మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ లో నియామకాలు జరిపి అధిక మంది అర్హతగా ఉన్న డిగ్రీ, పీజీ అర్హతల మీద ఉద్యోగాల నియామకాలే లేవని వారు ప్రశ్నించారు. నిరుద్యోగులు దైర్యంగా ఉండాలని ఆత్మహత్యలకు పాల్పడవద్దని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వానకి తగిన బుద్ది చెప్పేలా నిరుద్యోగులు సిద్దం కావాలన్నారు.