ఆంధ్రప్రదేశ్‌లో ఇది అధికారిక భాష.! డౌటేముంది.?

రాజకీయాల్లో కింది స్థాయి నాయకుడు కూడా మాట్లాడకూడని మాటలవి.! కానీ, పార్టీ అధినేతల దగ్గర్నుంచి ముఖ్యమంత్రుల వరకు.. అందరూ మాట్లాడేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.? వాడుక భాషగానో.. అధికారిక భాషగానో మార్చెయ్యొచ్చు కదా.?

మంత్రి జోగి రమేష్, ఈ రోజు రాజధాని అమరావతిలో పేదలకు ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్ళకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ వేదిక మీద వుండగానే, జోగి రమేష్ నోరు పారేసుకున్నారు విపక్షాల మీద.

కుక్క.. చిత్తకార్తె కుక్క.. పంది.. ఇలాంటి మాటల్ని జనసేన అధినేత మీదా, టీడీపీ అధినేత మీదా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మీదా.. తూటాల్లా పేల్చేశారు జోగి రమేష్. ఆ సమయంలో, ఆ ప్రసంగాన్ని విని, ఆనందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

రాజకీయ ప్రత్యర్థుల మీద మాటల తూటాలు పేల్చే క్రమంలో పార్లమెంటరీ లాంగ్వేజ్‌కి పరిమితమవుతుంటారు. కానీ, అది ఒకప్పుడు. ఇప్పుడంతా డైరెక్టర్ ఎటాక్.! బోసిడీకే.. అనే మాటకి అర్థాన్ని.. అత్యంత జుగుప్సాకరంగా ముఖ్యమంత్రే వివరించిన సందర్భం చూశాం.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి బూతుల్నీ చూశాం. మంత్రి రోజా గతంలో, పోలీస్ అధికారుల మీద వాడిన బూతుల సంగతి సరే సరి. కొడాలి నాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.!

ఏం సంకేతాలిస్తున్నాం జనానికి.? అన్న ప్రశ్న రాజకీయ నాయకుల మెదళ్ళలో మెదలదా.? ప్చ్.. ఆ ఛాన్సే లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒకింత సంయమనం పాటించాలి, మంత్రుల్నైనా అదుపు చేయాలి. లేదంటే, ముందు ముందు పరిస్థితులు మరింత దారుణంగా వుంటాయ్. బూతులే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అవుతాయ్.!