టీడీపీకి ‘నో’ చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.?

భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్బంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి కనిపిస్తోంది. కానీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.

అధికార వైసీపీ, ప్రధాని నరేంద్ర మోడీని తన పార్టీ నాయకుడన్నంతగా భావిస్తోంది. ఆ దిశగానే లక్షలాదిమంది జనాన్ని సమీకరించేందుకు వైసీపీ నానా పాట్లూ పడుతోంది. ప్రభుత్వం తరఫున ఏర్పాట్లే కాదు, పార్టీ తరఫున ఏర్పాట్లతోనూ మోడీని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. ఇది కాస్త చిత్రమైన సందర్భం.

ఇక, జనసేన ఎలాగూ బీజేపీకి మిత్రపక్షమే.! సో, ప్రధాని రాక నేపథ్యంలో జనసేన అధినేత కాస్తా విశాఖ వెళ్ళి, ప్రధానితో భేటీ అయ్యారు. అయితే, ఈ క్రమంలో జనసేన శ్రేణులు విశాఖలో పెద్దగా సందడి చేయకపోవడం ఆశ్చర్యకరం.

పార్టీ పరంగా.. అధికారికంగా బీజేపీ గనుక జనసేన పార్టీని ఆహ్వానించి వుంటే, విశాఖలో జనసేన గట్టిగానే సందడి చేసేది. కానీ, ప్రధాని కార్యాలయం నుంచి నేరుగా జనసేనానికి ఆహ్వానం వెళ్ళింది.. ప్రధానితో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైంది. సో, అక్కడివరకే.. వ్యూహాత్మకంగా జనసేనాని వ్యవహరించారు.

ఇదిలా వుంటే, బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో కొందరు, టీడీపీతో పొత్తు అంశాన్ని ప్రధాని వద్ద తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే, టీడీపీతో పొత్తు గురించి ఇప్పటికైతే ఏమీ ఆలోచించవద్దని వారికి ప్రధాని సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దేన్నయినా, నేరుగా డీల్ చేయడానికి ఇష్టపడతారు ప్రధాని మోడీ.

ఎన్నికల వ్యూహాలు రచించే క్రమంలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా కొందరు ముఖ్యమైన బీజేపీ నేతలు మాత్రమే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నాక, వాటి అమలు కూడా వేగంగానే వుంటుంది. టీడీపీతో పొత్తు వల్ల రాజకీయ లబ్ది ఎంత.? అన్న కోణంలో బేరీజు వేసుకుని అతి త్వరలో మోడీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. ఈ విషయమై టీడీపీ వద్ద కూడా ఖచ్చితమైన సమాచారం వున్నట్లు తెలుస్తోంది.