నేరం ప్రజల మీద నెట్టేసిన వైసీపీ మంత్రి.!

‘ప్రభుత్వం చాలా ముందు చూపుతో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేపడుతోంది.. ఆ ఆవిష్కరణల్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు..’ అంటూ వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎన్నుకుంటేనే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడేది. ఆ ప్రజలకు అర్థం కాని విషయాలు ఏముంటాయ్.? ఆ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మంత్రులైనా.. ఇంకెవరైనా వేరే గ్రహం నుంచి అయితే ఊడిపడరు కదా.? అన్నది సర్వత్రా జరుగుతోన్న చర్చ.

ప్రజలకు అర్థమయ్యేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేకపోవడమంటే, అది ప్రభుత్వంలో వున్నవారి వైఫల్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ‘ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేకత వున్న మాట వాస్తవమే.. దానిక్కారణం, ప్రజలకు కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థం కావడంలేదు.. సంస్కరణల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.. వాటిని ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు..’ అని ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు తాజాగా.
ఇదిగో, ఇలాంటి మాటలు చెప్పబట్టే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని మూలన కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన రాష్ట్ర ప్రజలు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ అదే గతి పట్టించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కంకణం కట్టుకున్నారని అనుకోవాలేమో.!

ప్రతి చిన్న విషయాన్నీ ముఖ్యమంత్రే పనిగట్టుకుని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేరు కదా.? మంత్రుల బాధ్య కూడా అది. ప్రజలకు అర్థం కాని విషయాలేమున్నాయి.? వాటిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎలా.? అన్న దిశగా మంత్రులూ తమవంతు కృషి చేయాలి.. బాధ్యతగా వ్యవహరించాలి. మూడు రాజధానుల విషయమైనా, ఇంకోటైనా.. ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తే ఎలా.? ప్రభుత్వమేమో మూడు రాజధానులు.. సమగ్రాభివృద్ధి అని చెబుతోంది. మంత్రి ధర్మాన మాత్రం పూర్తి స్థాయి రాజధాని విశాఖ.. మిగతా రెండూ డమ్మీ.. అంటున్నారు. అసలంటూ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏంటో మంత్రి ధర్మానకు అర్థమయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడమర్చి చెప్పాల్సి వచ్చేలా వుంది.