“కొసరోడు” పనికూడా జగన్ ఖాతాలోనే… “అసలోడు”ని వైసీపీకి దగ్గరచేస్తున్నారా?

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు.. అలా జగన్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది కరమైన పనీ జరగదని చెప్పుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. వాళ్ల ఇంట్లో పిల్లోడికి జ్వరం వచ్చినా కూడా జగన్ పాలనలో లోపమే అనే స్థాయికి వారు దిగజారిపోతున్నారు. ఈ సందర్భంగా “కొసరోడు” అంశం తెరపైకి వచ్చింది.

అవును… జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీకి వీలైనంత దూరంగా ఉంచాలనేది చంద్రబాబు లక్ష్యం అనేది తెలిసిన విషయమే! ఆయన సభల్లో కానీ, సమావేశాల్లో కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించినా, ఆయన ఫోటో కనిపించినా బాబు హర్ట్ అయిపోతుంటారు. అనంతరం ఆవేశపడిపోతుంటారు. ఆ ఫోటోలు, ఆ ఫోటోలు పట్టుకున్న వ్యక్తులు, జై ఎన్టీఆర్ అని నినాదాలు చేసే వ్యక్తులు తనకళ్ల ముందుకు కనిపించకూడదని అనుచరులకు ఆర్డర్స్ వేస్తారు.

తాజాగా విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా జూనియర్ కు ఆహ్వానం అందలేదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇదే సమయంలో రాజమండ్రిలో జరిగిన మహానాడుకు కూడా జూనియర్ కి ఆహ్వానం అందలేదు. దీంతో… అవసరం వచ్చినప్పుడు సేవలు వినియోగించుకోవడం.. ఆనాక వదిలేయడం అనేది జూనియర్ విషయంలో కూడా బాబు ఫాలోఅవుతున్నారని కన్ ఫాం అయ్యిందనే కామెంట్లు తెరపైకి వచ్చాయి.

ఈ సమయంలో ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సాగుతున్న సమయంలో జిల్లాలో పలుచోట్ల తెలుగుదేశం రంగులతో, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో వెలిసిన ఫోటోలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. “నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్, అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అనే నినాదాలతో రాత్రికి రాత్రే ఫ్లెక్సిలు వెలిశాయి. దీంతో మరోసారి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ తెరపైకి వచ్చింది.

అయితే తాజాగా ఈ విషయాలపై టీడీపీ నేతలు స్పందించారు. ఇందులో భాగంగా… మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే ఇది కూడా జగన్ పనే అని, వైసీపీ నాయకులే ఈ పని చేశారని, ఐప్యాక్ టీం సలహాతోనే స్థానిక వైసీపీ నేతలు ఇలా జూనియర్ ఎన్ టీఆర్ ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో… విద్వేషాలను రెచ్చగొట్టడానికే ఈ పనిచేశారని అంటున్నారు.

దీంతో… జూనియర్ ఎన్టీఆర్ ను పొగిడినంత మాత్రాన.. నారా లోకేష్ అసలు స్థానం “కొసరోడు” మాత్రమేనని తెలియజేసినంత మాత్రాన విద్వేషాలకు లోనయ్యేవారు ఎవరుంటారని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక్కడ కొసరోడు అని అంటే లోకేష్ గురించే అనే ఆలోచన టీడీపీ నేతలకు వచ్చిందంటే.. ఈ ఫ్లెక్సీ కరెక్టే కదా అని మరికొందమంది ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా… జూనియర్ పేరు వినిపించినా, ఆయన ఫోటో కనిపించినా లోకేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా కంగారు పడిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ఫ్లెక్సీల్లో జూనియర్ కనిపిస్తే వారికి వణుకే అని చెబుతున్నారు! అయితే… ఈ ఫ్లెక్సీల పని కూడా వైసీపీ నేతలపై నెట్టడం అంటే… జూనియర్ ఎన్టీఆర్ ని వైసీపీకి దగ్గర చేయడమే అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.