చంద్రబాబు దృతరాష్ట్ర కౌగిలి ఎలా ఉంటుందనేది బహుశా దేశ రాజకీయాల్లో కమలనాథులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. చంద్రబాబు వల్ల బీజేపీ తిన్న చావుదెబ్బలు అలాంటివి మరి! రాష్ట్రంలో బలపడిందనుకున్న ప్రతీసారి చంద్రబాబు ఆ పార్టీని దెబ్బకొడుతూ వచ్చారు. మామూలు దెబ్బలు కావు అవి. ఇప్పట్లో కోలుకోలేనంతటి ముష్టిఘాతాలు. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఛరిష్మాను ఉపయోగించుకుని ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ బలపడింది. ఓటుబ్యాంకును పెంచుకోగలిగింది.
దీన్ని పసిగట్టిన చంద్రబాబు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. తన బిగి కౌగిలిలో బంధించి పడేశారు. వాజ్‌పేయికి ఉన్న పేరు ప్రతిష్ఠలను నూటికి నూరు శాతం వాడుకున్నారు చంద్రబాబు. వాజ్‌పేయి ఛరిష్మా వల్ల బాగుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ కాదు.. టీడీపీ. ఆ ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగారు. మళ్లీ 2014లో చంద్రబాబుది అదే తీరు. ఈ సారి చంద్రబాబు బాబు వ్యూహానికి చిత్తయింది నరేంద్రమోడీ. చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాను దేవుడా అని మోడీ తల పట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తన తప్పులను, వైఫల్యాలన్నింటినీ బీజేపీ మీద నెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు చంద్రబాబు.
అదలావుంచితే- తాజాగా కాంగ్రెస్ పార్టీ కమలనాథులను చూసి గుణపాఠం నేర్చుకున్నట్టనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే విషయంపై కాంగ్రెస్ పునరాలోచన చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 175 స్థానాలకూ పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపించే నాటికి వారి వైఖరిలో మార్పు రావచ్చు అది వేరే విషయం. ఎందుకంటే- ఢిల్లీ నుంచి నరుక్కుని రాగల సత్తా చంద్రబాబుకు ఉంది.
1999, 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ ఏ రేంజ్‌లో దెబ్బతిన్నదో కాంగ్రెస్ చూస్తూనే ఉంది. కాంగ్రెస్ ఏరి, కోరి అలాంటి పరిస్థితిని తెచ్చుకుంటుందనుకోవడం అవివేకమే అవుతుంది. చంద్రబాబుతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ నిద్ర లేని రాత్రులను గడుపుతూ ఉండవచ్చు. అదే పరిస్థితి ఏపీలోనూ తలెత్తదనే గ్యారెంటీ లేదు. తాము గెలవకపోయినా పర్లేదని, చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఖర్మ తమకు వద్దంటూ మొర పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.
రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా మొదట్లో ఇలాగే వాదించారు. అయినా చంద్రబాబు వదల్లేదు. ఢిల్లీ నుంచి నరుక్కొచ్చారు. ఇష్టం లేకపోయినా చంద్రబాబుతో తాళి కట్టించుకున్నారు. సరిగ్గా నాలుగేళ్లు తిరిగే సరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. తమ తప్పేమీ లేకపోయినా నిందలను భరించాల్సి వచ్చింది. జనంలో చులకన కావాల్సి వచ్చింది. తమకూ అదే గతి పడుతుందనే భయం కాంగ్రెస్ నేతల్లో ఉంది. అందుకే టీడీపీతో పొత్తుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ససేమిరా అంటున్నారు.