బాబు అరెస్ట్ పై రఘువీరా సంచలన వ్యాఖ్యలు… పవన్ రియాక్షన్?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం లు హాట్ టాపిక్ లుగా మారిన సంగతి తెలిసిందే. ఎక్కడ విన్నా, ఎటు చూసినా… ఇప్పుడు రాజకీయాలన్నీ రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగానే జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు అరెస్ట్ పై రఘువీరా రెడ్డి స్పందించారు.. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ గురించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ రఘువీరారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ ఒత్తిడితోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ భుజంపై బీజేపీ పెద్దలు తుపాకీ పెట్టి వ్యవహారాలు నడిపిస్తోన్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఇదంతా బీజేపీ రాజకీయ ఎదుగుదలకోసం వేసుకున్న స్కెచ్ అని అన్నారు.

ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియకుండా ఏపీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ జరగదని చెబుతున్నారు రఘువీరా రెడ్డి. ఏపీలో బీజేపీ బలపడాలనుకోవటమే చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న బలమైన కారణమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఏపీలో టీడీపీ శ్రేణులకు కూడా రఘువీరారెడ్డి కీలక సూచనలు చేశారు.

ఇందులో భాగంగా… టీడీపీ శ్రేణులు నిరసనలు, ఉద్యమాలు ఎన్ని చేపట్టినప్పటికీ కలిగే ప్రయోజనం శూన్యమని సూచించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలో ఉన్నందూవల్ల… టీడీపీ వాటిని కోర్టులోనే పరిష్కారం చేసుకోవాలి కానీ వీధిపోరాటాల వల్ల వొరిగేది ఏమీ లేదని చెప్పకనే చెప్పారు! ఇప్పుడు ఈ కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

అయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనే కామెంట్లు ఇప్పటికే టీడీపీ, కమ్యునిస్టు, బీఆరెస్స్, టి.కాంగ్రెస్ నేతల నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ఏం జరుగుతుందో బీజేపీకి తెలియదా అంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో మంత్రి, బీఆరెస్స్ నేత మల్లారెడ్డి వంటి నేతలు నేరుగా బీజేపీ పైన ఆరోపణలు చేసారు.

అయితే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం ఈ అరెస్ట్ తో బీజేపీకి సంబంధం లేదని చెబుతు… ఈ అరెస్ట్ ను బీజేపీ ఖండించిందని చెప్పారు. అంతకు మించి బీజేపీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ స్పందించింది లేదు! దీంతో… ప్రస్తుతానికి బీజేపీతోనే పొత్తు.. ఫ్యూచర్ లో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించిన పవన్ కల్యాణ్… ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.