ఏపీ సిఎం వైఎస్ జగన్ ఎక్కడలేని విధంగా రాష్ట్రం లో ప్రవేశ పెట్టిన వాలెంటీర్ వ్యవస్థపై ఏ స్థాయిలో మంచి స్పందన లభించిందో ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తరువాత అంతే స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది. కాగా వాలెంటీర్ వ్యవస్థ పై తాజాగా సిఎం జగన్ స్పంధించారు. ఏపీలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు విషయాలపై ఆయన స్పంధించారు. ప్రభుత్వం ఏర్పడి అప్పుడే 20 నెలలు గడిచిపోయిందని పరిపాలనలో 20 నెలలు అంటే, దాదాపు మూడో వంతు సమయం గడిచిపోయిందని సిఎం జగన్ వ్యాఖ్యానించారు. కాబట్టి ఇప్పుడు రిలాక్సేషన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని అధికారులకు సూచించారు. ప్రస్తుతం పరిపాలనలో గతంలో కంటే ఎంతో మార్పులు చోటు చేసుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో మండల స్థాయిలో పరిపాలన అందేది. దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, ఇప్పుడు గ్రామ స్థాయిలోనే పాలన అంధిస్తున్నామని అన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి వారి ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా చేరవేస్తున్నామని తెలిపారు. వారిలో కొందరు వేతనాల పెంపు కోరుతూ రోడ్డెక్కడం విచారకరం అని సిఎం జగన్ అన్నారు.
వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పని చేసే వారని అర్ధం. కానీ దానర్థం మార్చేసి, ప్రభుత్వం నుంచి ఇంకా ఆశించడం, మొత్తం వ్యవస్థనే నీరు గారుస్తుందని వ్యాఖ్యానించారు.
అయితే వాలెంటిర్లకు మరొక విధానం ద్వారా ప్రోత్సాహం ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సిఎం జగన్ స్పష్టం చేశారు. ఉగాది పండగ రోజు నుంచి ప్రతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వాలంటీర్లను సత్కరించబోతునట్లు తెలిపారు. వారికి సేవా రత్న, సేవా మిత్ర వంటి బిరుదులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలా చేయడం వల్ల వాలంటీర్ల సేవలను గుర్తించినట్లు అవుతుందని సిఎం జగన్ తెలిపారు.