ఆంధ్ర ప్రదేశ్: కరోనా కారణంగా ప్రజలందరు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో కొన్ని ఇబ్బందలకు గురి అయ్యారు. అలాంటి వారిలో మీడియా ప్రతినిధులు గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి. ఎందుకంటే కరోనా కారణంగా లొక్డౌన్ పెట్టిన సందర్భంలో మీడియా వారు ప్రాణాలకు తెగించి వార్త సమాచారాన్ని అందించారు. వారి బాధ్యతని పాటించే క్రమంలో చాలా మంది మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడి మరణించారు. వారిని ప్రత్యేక కోవలోకి చేర్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి.
కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ఎక్కువ సమయం అక్కర్లేదు. కానీ.. పాలకులకు మాత్రం పట్టదు. వారికుండే పని ఒత్తిడి కారణంగా అలా జరగటం సహజం. అయితే.. తమ వరకు విషయాలు వచ్చాక.. క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవటం చాలా కొద్దిమందే చేస్తుంటారు. అలాంటి కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనానేపథ్యంలో వారియర్స్ జాబితాలో మీడియా ప్రతినిధులు చేరినా.. వారిని ప్రభుత్వాలు పట్టించుకున్నది లేదు.
మిగిలిన రంగాలకు చెందిన వారికి ఉండే వసతులు.. సదుపాయాలు పాత్రికేయులకు తక్కువే. అదే సమయంలో.. తమ కష్టాన్ని చూడాలని.. వాటిని పట్టించుకోవాలని పదే పదే అడగటానికి తెగ మొహమాటం పడుతుంటారు. అలాంటి జర్నలిస్టుల సమస్యల మీద తాజాగాసీఎం జగన్ స్పందించారు. కరోనా వేళ.. మహమ్మారి బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు జర్నలిస్టు సంఘాల నేతలు.
సోమవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు దేవులపల్లి అమర్, కె. శ్రీనివాస్ రెడ్డి. కోవిడ్ కారణంగా మరణించిన పాత్రికేయుల కుటుంబాలకురూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు జగన్ అంగీకరించారు. ఇలా అడిగిన వెంటనే.. సమస్యలోని న్యాయాన్ని గుర్తించి.. క్షణాల్లోనిర్ణయం తీసుకోవటం.. అధికారిక ఆదేశాలు తయారు చేయాలని చెప్పటం అందరూ చేయరు. ఇదే సమస్య తెలంగాణలోని జర్నలిస్టులు కూడా ఎదుర్కొంటున్నారు. మరి.. వారి విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం.