బిగ్ బ్రేకింగ్: ఢిల్లీకి చంద్రబాబు, అమిత్ షాతో భేటీ… ఆ మూడు అంశాలే కీలకం!

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్ని, చట్టంలో పొందుపరిచిన అంశాల్ని నెరవేర్చాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు… పోలవరాన్ని తనకు ఇచ్చేస్తే చాలు, హోదాప్లేస్ లో ప్యాకేజీ రూపంలో పైసలిస్తే చాలు అంటూ కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని, ఫలితంగా రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టుపెట్టారని చంద్రబాబుపై వైసీపీ నేతలు ఫైరవుతున్న సంగతి తెలిసిందే. ఈసమయంలో చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు.

అమరావతిలో అవినీతి టెన్షన్:

అమరావతి పేరు చెప్పి చంద్రబాబు & కో లెక్కలేనంత అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని.. చట్టవ్యతిరేక కార్యక్రమాలు ఎదేచ్చగా చేశారని.. చట్టాలను తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా పరిపాలించారని జగన్ సర్కార్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ దూకుడు పెంచింది.. ఇప్పటికే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని సైతం జప్తు చేసే ఛాన్స్ ఇవ్వమని న్యాయస్థానాన్ని కోరింది.

ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని బ్రతిమాలి బయటపడాలని బాబు బావిస్తున్నారని, అందుకే ఉన్నఫలంగా హస్తిన యాత్ర అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో బాబు బలహీనతలను పొలిటికల్ గా క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతోనే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నపలంగా బాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.

రామోజీ కోసం రాయబారం:

మరోవైపు మార్గదర్శి వ్యవహారంలో కూడా ఏపీ సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే భారీమొత్తంలో మార్గదర్శి ఆస్తులను జప్తు చేసిన సీఐడీ అధికారులు.. మెయిన్ బ్యాంక్ అకౌంట్ ను కూడా సీజ్ చేశారు! దీంతో గతంలో ఎన్నడూలేనంతగా రామోజీ విలవిల్లాడుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదే కేసుకు సంబందించి సీఐడీ అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో కూడా మంచమెక్కిన రామోజీ రావు… ఇది కాలమహిమో – జగన్ మహిమో అంటూ కామెంట్లు సైతం చేశారు.

దీంతో అటు వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ, ఇటు టీడీపీకి అన్నిరకాలుగా తోడుండే రామోజీ విషయంలోనూ జగన్ సర్కార్ దూకుడు ప్రదర్శిస్తూ చెక్ పెడుతున్నారనే ఆందోళనలో టీడీపీ శ్రేణులు ఉన్నారంట. దీంతో రామోజీ సామ్రాజ్యానికి మెయిన్ ఫైనాన్సియల్ సోర్స్ అయిన మార్గదర్శి విషయంలో కూడా అమిత్ షా తో మాట్లాడేందుకు రామోజీ తరుపున చంద్రబాబు రాయబారిగా ఢిలీకి వెళ్తున్నట్లు మరో వెర్షన్ వినిపిస్తుంది.

అసలు ఈ అపాయింట్ మెంట్ ఇప్పించింది కూడా రామోజీరావే.. ఈ సమయంలో చంద్రబాబుకు బీజేపీ పెద్దలు అపాయింట్ మెంట్ ఎందుకు ఇస్తారు? అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!

పొత్తుల పంచాయతీపై క్లారిటీ:

కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వింటున్న బీజేపీ పెద్దలు… పొత్తుల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేనతో మిత్రబంధం కొనసాగిస్తున్న బీజేపీ… టీడీపీతో పొత్తు విషయంపై కూడా క్లారిటీ తీసుకోవడం కూడా బాబు టూర్ లో భాగమని అంటున్నారు.

ఇలా మూడు కీలక బాధ్యతలతో హస్తినకు ప్రయాణమవుతున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా జూన్ 3 – శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు చంద్రబాబు. అనంతరం రాత్రికి రాత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఇక ఆదివారం ఉదయం ప్రధాని మోడీతో కూడా భెటీ కానున్నారని సమాచారం. రాష్ట్ర ప్రయోజనలా ప్రస్థావన లేకపోయినా… చంద్రబాబు పొలిటికల్ కెరీర్ కు సంబంధించి ఈ భేటీ చాలా కీలకమనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో… ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.