అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయంటే టీడీపీ నేతల్లో పుట్టుకొచ్చే కలవరం అంతా ఇంతా కాదు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎవరొచ్చి మీదపడతారో, ఎలాంటి టాపిక్ లేవనెత్తి బద్నాం చేస్తారోనని చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా బిక్కుబిక్కుమంటూ ఉంటారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగనే నేరుగా చంద్రబాబు మీద, ఆయన ఎమ్మెల్యేల మీద సెటైర్లు, భారీ ఆరోపణలు చేసి బెంబేలెత్తించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్ మాటలకు, దూకుడుకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడ తెలీక చంద్రబాబు చేష్టలుడిగి కూర్చోవడం అందరికీ గుర్తే. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీకి అంతకంటే గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. గతంలో అయినా సీరియస్ విషయాల్లో టీడీపీ మీద విమర్శలు పడేవి. కానీ ఇప్పుడు మరీ కామెడీగా టీడీపీని, చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు వైసీపీ నేతలు.
మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద జగన్ వేసిన భజన వీడియో సర్వత్రా హాట్ టాపిక్ అయిపోయింది. కీలకమైన పోలవరం మీద నిన్న బుధవారం పెద్ద చర్చే జరిగింది. ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పోలవరాన్ని నాశనం చేస్తున్నాయని, తమ హయాంలోనే పనులు జరిగాయని వాదిస్తూ ఉండగా ఒక్కసారి అందుకున్న జగన్ చంద్రబాబు పోలవరం పేరుతో ఏ స్థాయిలో నిధుల దుర్వినియోగం చేశారో చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చిని బయటపెట్టారు. పోలవరం పేరుతో ప్రచారం చేసుకుని పేరు తెచ్చుకోవడానికి చంద్రబాబు వేసిన పోలవరం సందర్శన టూర్ గురించి చెప్పుకొచ్చారు.
కేంద్రం నుండి నిధులు రావడం ఆలస్యమయ్యాయని చెబుతూ సొంత నిధులతో పోలవరం కట్టడానికి పూనుకున్నారు చంద్రబాబు. ముందు మనం ఖర్చు పెడితే ఆ తర్వాత మెల్లగా కేంద్రం నుండి రీఎంబర్సిమెంట్ చేసుకోవచ్చని అన్నారు. అయితే ఖర్చు చేసిన నిధుల్లో ఇంకా కొంత రావాల్సి ఉంది. అది వేరే విషయం అనుకోండి. అయితే ఖర్చుపెట్టిన సొంత నిధుల్లో ఎంత మేరకు నిజాయితీగా ఖర్చయ్యాయి, ఎంత దుబారా అయ్యాయి అనే లెక్కలు చూసుకుంటే బాబుగారి ప్రచార హంగులకే 83 కోట్ల 45 లక్షలు ధారపోశారని తేలింది. దీన్నే జగన్ అసెంబ్లీలో హైలెట్ చేశారు. పోలవరం ఎలా కడుతున్నామో చూడండి అంటూ చంద్రబాబు బస్సులు వేసి జనాన్ని పోలవరం వద్దకు తిప్పేవారు. వారిలో కొందరు మహిళలు పనిగట్టుకుని ‘జయము జయము చంద్రన్న’ అంటూ భజన పాటలు కూడ పాడారు.
బాబుగారు లేకపోతే పోలవరమే లేదన్న స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ వీడియోలను అసెంబ్లీలో ప్లే చేసిన జగన్ అందరినీ కడుపుబ్బా నవ్వించి చివర్లో ఈ భజన పాటల కోసం 83 కోట్ల ప్రజాధనం ఖర్చుచేశారని లెక్కలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇది విన్న జనం సైతం ఓరినాయనో.. సెలబ్రిటీల చేత ప్రమోషన్ చేయించినా ఈ భజన పాటల ఖర్చు కంటే తక్కువే అవుతుంది కదా అంటూ ముక్కునవేలేసుకోగా కేంద్రం మాత్రం ఈ స్థాయిలో దుబారా జరిగిందా అని లెక్కలు చూసుకుంటున్నారు. కొన్నాళ్లుగా కేంద్రం పోలవరాన్ని బాబు ఏటీఎం తరహాలో వాడుకున్నారని, భారీ అవినీతి జరిగిందని, అంచనా వ్యయం అమాంతం పెంచేశారని ఆరోపిస్తూ వచ్చారు. అదేం లేదని బాబుగారు బుకాయిస్తూ వచ్చినా ఇప్పుడు జగన్ చెప్పిన ప్రచార దుబారా ఖర్చుల లెక్కలతో కేంద్రానికి మరిన్ని బలమైన ఆధారాలు దొరికినట్టైంది.