ప్రతిపక్షాలను తిట్టటం కోసమే ధర్మ పోరాట సభలా ?

చంద్రబాబునాయుడు వాలకం చూస్తే అలాగే కనిపిస్తోంది. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత వరుసగా ధర్మపోరాట సభ లంటూ భారీ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతీ జిల్లాలోను ఓ సభ పెడుతున్నారు. ఇంతకీ ధర్మపోరాటసభలు దేనికయ్యా అంటే నాలుగేళ్ళపాటు ఏపి అభివృద్ధి విషయంలో కేంద్రం చేసిన అన్యాయంపై తిరుగుబాటట.  ఏదీ, నాలుగేళ్ళ పాటు ఎన్డీఏ ఉంటూ బిజెపితో అంటకాగిన తర్వాత. సరే ధర్మపోరాట సభల్లో ఏమి చెబుతున్నారంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని తిట్టటం, రాష్ట్రంలో వైసిపి, జనసేన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ లను తిట్టటంతప్ప ఇంకేమీ కనిపించటం లేదు.

 

నాలుగేళ్ళ పాటు ఏపి అభివృద్ధికి కేంద్రం  చేయాల్సినంత  చేయలేదన్నది వాస్తవం. మోడి  చేయలేదన్నది ఎంత వాస్తవమో చంద్రబాబు చేతకాని తనం కూడా అంతే వాస్తవం. మోడి ఏపి అభివృద్ధికి కేంద్రం ఏమీ చేయటం లేదని చంద్రబాబుకు నాలుగేళ్ళ తర్వాతే అనిపించిందా ? వ్యక్తిగత లబ్దికి పాకులాడిన చంద్రబాబు అది కుదరకపోయేటప్పటికి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన మాట వాస్తవం. ఆ విషయం జనాలకు తెలీదనుకుని చంద్రబాబు మోడిపై ఎగిరెగిరి పడుతున్నారు. పనిలో పనిగా జగన్, పవన్ లను కూడా విమర్శిస్తున్నారు. సరే, ఇప్పటికి ఏడు చోట్ల ధర్మపోరాటసభలు పెట్టినా అన్నీ చోట్లా అరిగిపోయిన రికార్డే తప్ప కొత్తదనం ఏమీ ఉండదు.

 

ఈరోజు నెల్లూరులో జరిగిన ధర్మపోరాటసభలో కూడా అదే రిపీట్ అయ్యింది. ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత టిడిపి ఎంపిలు, ఎంఎల్ఏలపై ఐటి దాడులు చేయిస్తున్నారట. ఐటి దాడులు చేయించటమంటే రాష్ట్రంపై కక్షసాధింపు చర్యలకు దిగటమేనట. టిడిపి ఎంపిలు, ఎంఎల్ఏలపై ఐటి దాడులు జరిగితే రాష్ట్రంపై కక్షసాధింపు ఎలాగవుతుందో చంద్రబాబుకే తెలియాలి. నాలుగున్నరేళ్ళల్లో టిడిపి ప్రజాప్రతినిధుల్లో చాలామంది అడ్డదిడ్డంగా సంపాదించుకున్నారన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కోట్ల రూపాయల  భారీ కుంభకోణం జరిగిందిన కాగ్ కూడా నిర్ధారించింది. కాంట్రాక్టులన్నీ టిడిపి నేతలవే. కాబట్టి ఐటి దాడులు కూడా టిడిపి నేతపైనే జరుగుతున్నాయి.

 

పైగా తాను దేశాన్ని రక్షించటానికే దేశంలోని అందరు నేతల దగ్గరకు వెళుతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. దేశానికి వచ్చిన సమస్యకన్నా తెలుగుదేశానికి వచ్చిన తక్షణ సమస్యే ఎక్కువ. అందుకనే మద్దతుకోసం అందరి దగ్గరకు తిరుగుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు మాటలు మొదటి నుండి విచిత్రంగానే ఉంటాయి. తప్పులన్నీ తనవైపు పెట్టుకుని వాటన్నింటినీ ప్రతిపక్షాలపైకి తోసేయటంలో దిట్ట. మీడియా మద్దతుంది కాబట్టి చంద్రబాబు ఏమి మాట్లాడినా చెల్లుబాటవుతోంది. లేకపోతే ధర్మపోరాట సభల పేరుతో చంద్రబాబు చెబుతున్న విషయాలు చాలా వరకూ అవాస్తవాలే. ప్రతిపక్షాలను తిట్టటానికి చంద్రబాబు చక్కగా ప్రభుత్వ ఖర్చును వాడేస్తున్నారు.