తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ హాయాంలో టీడీపీలోకి ప్రవేశించిన పరిటాల రవి అనతి కాలంలోనే ఎదురులేని శక్తిగా ఎదిగారు. అనంతపురం జిల్లాలో పూర్తి పట్టు సాధించి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ఆయన మరణానంతరం అయన కుటుంబానికి టీడీపీలో సముచిత స్థానం ఇచ్చారు చంద్రబాబు. రవి సతీమణి సునీతను ఎమ్మెల్యే టికెట్ గెలుపొందాక మంత్రి పదవిని కూడ ఇచ్చారు. ఇలా రెండు పర్యాయాలు రాప్తాడు నుండి సునీత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019కి ముందు పరిస్థితులు మారాయి. అనంతపురంలో వాతావరణం పరిటాల కుటుంబానికి ప్రతికూలంగా తయారైంది. వైసీపీ హవా పెరిగింది.
దీంతో సునీత తప్పుకుని కుమారుడు శ్రీరామ్ ను రాప్తాడు నుండి నిలబెట్టారు. కానీ శ్రీరామ్ ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీకి పరిటాల కుటుంబానికి గ్యాప్ పెరిగింది. సునీత , శ్రీరామ్ ఇద్దరూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. తమ ఓటమికి కారణం వైఎస్ జగన్ హవా కాదని, చంద్రబాబు తీసుకున్న నిర్ణయమని అంటున్నారట వారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు జేసీ కుటుంబం టీడీపీలో చేరింది. అప్పటివరకు బద్ద శత్రువుల్లా ఉన్న జేసీ ఫ్యామిలీ పార్టీలోకి రావడాన్ని పరిటాల ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోయింది. కానీ చంద్రబాబు సర్దిచెప్పడంతో ఊరుకున్నారు.
కానీ తాము ఎన్నికల్లో ఓడిపోవడానికి జేసీ కుటుంబం టీడీపీలోకి రావడమేనని, జేసీ రాకను తాము స్వాగతించినా తమ అభిమానులు, వర్గం వ్యతిరేకించారని, ఇకపై కూడ జేసీ ఫ్యామిలీ పార్టీలో ఉంటే తమ పరిస్థితి ఇంతేనని, కాబట్టి ఏదో ఒకటి తేల్చమని చంద్రబాబు ముందు ఏకరువు పెట్టారని పొలిటికల్ టాక్. కానీ చంద్రబాబు జేసీ కుటుంబాన్ని పార్టీ నుండి బయటికి పంపడం కుదరదని, సీమలో పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని, ఈ సమయంలో జేసీ ఫ్యామిలీని దూరం చేసుకోవడం మంచిది కాదని ఇద్దరూ కలిసి పనిచేస్తేనే పాత వైభవం వస్తుందని ఖరాఖండిగా చెప్పినట్టు మాట్లాడుకుంటున్నారు.