వాలంటీర్లపై బురద స్క్రిప్ట్… ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టిన బాబు!

వైసీపీ నాయకులు లోకేష్ ను చంద్రబాబు సొంతపుత్రుడిగా చెబుతూ, పవన్ కల్యాణ్ ని దత్తపుత్రుడు అని సంబోదిస్తుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది బీజేపీ నేతలు సైతం అలాంటి వరసలతోనే పిలుస్తున్నారని అంటున్నారు! ఆ సంగతి అలా ఉంటే… అటు లోకేష్ కైనా, ఇటు పవన్ కైనా చంద్రబాబే స్క్రిప్ట్ ఇచ్చి నడిపిస్తుంటారని ఒక రూమర్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుంటుంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏలూరులో వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లు ఉమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారని చెబుతూ… వారిని పరోక్షంగా బ్రోకర్లుగా పవన్ సంభోదించారు. అయితే ఇది పొరపాటున అన్నటువంటి కామెంట్ కాదని.. ఆ తర్వాతి సభలో పవన్ వైఖరి చూసినవారికెవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది!

ఏలూరులో వాలంటీర్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పవన్… ఆ తర్వాత జరిగిన దెందులూరు సమావేశంలోనూ, తాడేపల్లి గూడెంలోని సభలోనూ దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు పెరిగే సరికి కాస్త సన్నాయి నొక్కులు నొక్కడం ప్రారంభించారు. అయితే ఇదంతా పవన్ కు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే అని అంటున్నారు పరిశీలకులు!

అవును… వాలంటీర్లపై చంద్రబాబుకు ఎప్పటినుంచో అక్కసు ఉందన్న సంగతి తెలిసిందే! వాలంటీర్లపై గోను సంచులు మోసే వారని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి డోర్లు కొడుతున్నారని.. అదేమి ఉద్యోగం అని చాలా చిన్నతనంగా మాట్లాడారు! తాను ఎక్కడినుంచి వచ్చిందీ గతం మరిచిపోయారు! అనంతరం చంద్రబాబుకు వాలంటీర్ల లెవెల్ తెలిసిందో ఏమో కానీ… తర్వాత వాలంటీర్ల వ్యవస్థ మంచిదే అని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో తన యువగళం పాదయాత్రలో భాగంగా… నారా లోకేష్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. ఇలా వాలంటీర్ల విషయంలో చంద్రబాబు, లోకేష్ లు సేఫ్ గేం ఆడారు. ఫలితంగా చంద్రబాబు లోకేష్ లు కడుపులో కత్తులు పెట్టుకుని వాలంటీర్లను కౌగిలించుకుంటున్నారు అంటూ కామెంట్లు మొదలైపోయాయి.

ఈ సమయంలో ఎలాగైనా వాలంటీర్లపై బురద జల్లాలి అని ఫిక్సయిన బాబు… అందుకు పవన్ కల్యాణ్ ని బలిపశువును చేశారని అంటున్నారు. దీంతో పవన్ ప్యాకేజీ మాయలో పడి ఆ స్క్రిప్ట్ ఎంత డేంజర్ అయ్యిందో గ్రహించలేకపోయారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఫలితంగా… పవన్ తన ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారాహి యాత్రకు ముందు పవన్ పై సామాన్య ప్రజలకున్న అభిప్రాయం… ఈ యాత్ర రెండోదశకు చేరుకునే సరికి పూర్తిగా పోయిందని.. పవన్ వ్యక్తిగత ప్రతిష్ట పోవడంతోపాటు.. జనసేన మనుగడ ప్రశ్నార్ధకం అయ్యిందని అంటున్నారు. ఫలితంగా… టీడీపీ తోడు ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ చేసి మనుగడ సాధించడం కష్టం అనే పరిస్థితికి చేరిపోయారని చెబుతున్నారు.

ఫలితంగా… చంద్రబాబు ఆ వాలంటీర్ల స్క్రిప్ట్ ని తన సొంతపుత్రుడికి ఇవ్వకుండా… పవన్ కి ఇవ్వడం వల్ల రెండురకాలుగా కలిసొచ్చిందని అంటున్నారు. ఒకటి పవన్ వ్యక్తిగత ప్రతిష్ట పూర్తిగా పోతూ… పవన్ కంటే లోకేషే బెటర్ అనే మాట తెరపైకి రావడంతోపాటు… జనసేనకు గ్రాంస్థాయిలో కేడర్ లేకపోయినా, శత్రువులను తయారు చేయగలగడం!! ఇన్ని లాభాలు ముందే ఊహించిన చంద్రబాబు… ఈ మేరకు ఆ స్క్రిప్ట్ సొంత పుత్రుడికి ఇవ్వకుండా… దత్తుడికి ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు!