వైసీపీ అన్నంత పని చేసింది. కుప్పంలో చంద్రబాబు నాయుడుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా చావుదెబ్బ తీసింది. ప్రతిపక్ష నేత ఇలాకాలోనే 89 గ్రామంలో 74 గ్రామాల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ ఫలితాలు చూశాక కుప్పంలో ఎంత పకడ్బంధీగా వ్యూహం పన్నారో అర్థమవుతోంది. గోనుగూరు, గుడ్లనాయనిపల్లె, పైపాళ్యం, గుడుపల్లె మండలంలో ఓఎన్.కొత్తూరు, కుప్పిగానిపల్లె, రామకుప్పం మండలంలో చెల్దిగానిపల్లె, వీర్నమల, శాంతిపురం మండలం మొరసపల్లె, సి.బండపల్లె లాంటి బలమైన పంచాయతీలు కూడ వైసీపీ ఖాతాలో పడ్డాయి.
చిత్తూరు జిల్లా వ్యవహారాలన్నీ మంత్రి పెద్దిరెడ్డి పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును కుప్పంలో కుప్పకూల్చాలన్న ప్రధాన లక్ష్యంతోనే ఆయన పనిచేశారు. చంద్రబాబు నాయుడేమో కుప్పంలో నాకు ఎదురేముంది అనుకుని లైట్ తీసుకున్నారో ఏమో కానీ దెబ్బతినేశారు. కుప్పం పంచాయతీల్లో వైసీపీ శ్రేణులు గట్టి వ్యూహం ప్రకారం పనిచేశారు. ఓటర్లను అనుక్షణం గ్రిప్లో పెట్టుకున్నారు. సమగ్ర సర్వ్ చేసుకుని ట్రెండ్ మారేలా పనిచేశారు. నిజానికి చంద్రబాబు కుప్పం మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గ్రామ స్థాయిలో టీడీపీ బలం ఎంతో బాబుగారు అంచనా వేయగలరు. అందునా సొంత నియోజకవర్గం మీద అవగాహనా ఇంకా ఎక్కువే ఉంది ఉండాలి.
కానీ తేడా వచ్చిందల్లా చివరి రోజులోనే అనిపిస్తోంది. టీడీపీ ఇక చాలని రిలాక్స్ అయిన మరుక్షమే వైసీపీ అలర్ట్ అయింది. రెట్టింపు ఉత్సాహంతో పనిచేసింది. వాడాల్సిన వనరులను విపరీతంగా వాడుకుంది. మాటలు, చేతల్లో చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. తెలుగుదేశం మాత్రం మనవాళ్లే ఎక్కడికి పోతారులే అనుకున్నారు. కానీ పోయారు. వైసీపీ మద్దతుదారులకు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించారు. రాజకీయవర్గాల చర్చల మేరకు కుప్పల్లో పంపకాలు కూడ భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. టీడీపీ, వైసీపీ పోటీపడి మరీ చేతులు తడిపాయట. కానీ చివరి దశలో వైసీపీ వేసిన రెండో రౌండ్ డిస్ట్రిబ్యూషన్ మంచి ప్రభావాన్ని చూపించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మాత్రం ఓటమిని మనస్ఫూర్తిగా ఒప్పుకోలేకున్నాయి. కేవలం భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని అంటున్నారు. అన్నీ అయిపోయాక టీడీపీ ఎన్ని సాకులు చెప్పిఏం లాభం. కుప్పంలో బాబు కుప్పకూలారు అనేది రుజువయ్యాక.