అది 2014-15 సంవత్సరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న సమయం! ఫలితంగా తన భయం వల్ల 10ఏళ్ల ఉమ్మడి రాజధాని హక్కుని గాలికి వదిలేసి పెట్టేబేడా పట్టుకుని రాత్రికి రాత్రి కరకట్టకు వచ్చేసిన పరిస్థితి! నాడు చంద్రబాబు చూపించిన మేకపోతు గాంభీర్యం తాలూకు ప్రతిస్పందన మరోసారి మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో ఉమ్మడిరాజధాని హక్కుని వదులి హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించిన చంద్రబాబు… తెలంగాణ ప్రభుత్వంపై దబాయింపు ధోరణి ప్రదర్శించేవారు. ఇందులో భాగంగా… “నీకు సీఐడీ ఉంటే నాకూ సీఐడీ ఉంది.. నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది.. నీకు పోలీసులుంటే నాకూ పోలీసున్నారు” అంటూ కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి చంద్రబాబు ఇలా బెదిరింపు దోరణికి దిగేవారు!
నాడు అరెస్ట్ భయం మరీ ఎక్కువగా ఉండేదో ఏమో కానీ… ప్రతీ సభలోనూ తనకోసం తమ్ముళ్లంతా చుట్టూ రక్షణ వలయంగా ఉండాలి అంటూ చెప్పుకునేవారు! కట్ చేస్తే… ఇప్పుడు తాజాగా ఐటీ నోటీసులు తెరపైకి వచ్చాయి. అమరావతి రాజధాని నిర్మాణాల్లో షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుండి సుమారు రూ. 118 కోట్ల ముడుపులను అందుకున్నారని ఐటీ శాఖ తేల్చింది. ఈ విషయంపై సమాధానం ఇవ్వమని చంద్రబాబుకు నోటీసిచ్చింది.
అయితే లంచం తీసుకుంటే తీసుకున్నానని, తీసుకోకపోతే తీసుకోలేదని ధైర్యంగా ధర్జాగా చెప్పాల్సిన చంద్రబాబు తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తనను విచారించే అర్హతే ఐటీ శాఖకు లేదని తేల్చి చెబుతున్నారు! సెంట్రల్ సర్కిల్ ఉండగా, హైదరాబాద్ సర్కిల్ అధికారులు తనకు నోటీసు ఇవ్వటం ఏమిటని దబాయించారు. దీంతో మరోసారి గోడచాటు పలుకులు పలకడం మొదలుపెట్టారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈసారి ఈ దబాయింపు ధోరణి సెట్ అవ్వదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఐటీశాఖ సీరియస్ గా ఉందని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లక్కూ లోగే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. దీనికి బలం చేకూరుస్తూ… ఇప్పటికే ఇచ్చిన నాలుగు నోటీసులకు చంద్రబాబు దబాయింపు పద్ధతిలోనే సమాధానం ఇవ్వడంతో… ఫైనల్ గా షోకాజ్ నోటీసిచ్చింది ఐటీ శాఖ.
ముడుపులు ఇచ్చింది ఎవరు? తీసుకున్నది ఎవరు? ఏ రూపంలో, ఏ వ్యక్తులు తీసుకున్నారు? వంటి పూర్తి వివరాలను వెల్లడిస్తూ, అందుకు సంబంధించిన వాట్సప్ స్క్రీన్ షాట్ లను కూడా ప్రాస్థావిస్తూ దీనికి సమాధానం ఇవ్వమని కోరింది! ఇదే సమయంలో చంద్రబాబును ప్రశ్నించటానికి తమకున్న అధికారాలను కూడా సవివరంగా వివరించింది.
ఇదే సమయంలో మరింత క్లియర్ గా చెప్పిన ఐటీ శాఖ… షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలను కూడా హెచ్చరించిందని తెలుస్తుంది. దీంతో… చంద్రబాబు బెంగపట్టి బెడ్ ఎక్కారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తనను ఆదుకునేది ఎవరా అనే అంశంలో కొట్టిమిట్టాడుతున్నారని తెలుస్తుంది! మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!