2019 ఎన్నికల ముందు నుంచీ చంద్రబాబు ఏది పట్టినా మట్టైపోతోన్న పరిస్థితిలు ప్రస్తుతం నెలకొన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఆయన ఏది ముట్టుకుంటే అది మట్టి అయిపోతుందని.. అది బంగారం, అయినా వెండి అయినా.. ఇసుకలా మారిపోతోందని చెబుతున్నారు. అందుకు కొన్ని తాజా ఉదాహరణలు చూపిస్తున్నారు పరిశీలకులు.
2019లో ఎన్నికల్లో చావుదెబ్బ.. అనంతరం జనాల్లో తిరిగే ఛాన్స్ లేకుండా కోవిడ్.. అనంతరం సంక్షేమం విషయంలో జగన్ కు ఫుల్ మార్కులు.. అసెంబ్లీలో వైసీపీ నేతలు వాయించి వదులుతున్న పరిస్థితి.. దీంతో శపథం పేరుమీద అసెంబ్లీకి గైర్హాజరు.. అనంతరం అక్కడక్కడా సభలు.. వాటిలో ప్రమాధాలు.. మరణాలు!
చినబాబు లోకేష్ ని అయినా జనాల్లోకి పంపుదామని, ఫలితంగా ఫుల్ మైలేజ్ సంపాధిద్దామని బాబు ప్లాన్ చేశారని అంటుంటారు. ఇందులో భాగంగా యువగళం పాదయాత్ర మొదలైంది. అయితే టీడీపీ అనుకూల మీడియా సైతం లైవ్ ఇవ్వలేని, మెయిన్ పేజిలో ప్రచురించలేని స్థాయిలో ఆ యాత్ర కొనసాగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా… ఈ యాత్రవల్ల కొత్తగా వచ్చేదాని సంగతి పక్కనపెడితే… పోయేదే ఎక్కువుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయంట.
మరోపక్క పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుని… కాపు సామాజికవర్గ ఓట్లు ఎన్నో కొన్ని తెచ్చుకోవొచ్చని.. ఫలితంగా 2019లో వచ్చిన ఫలితాలను మెరుగుపరుచుకోవాలని ఆలోచించారని అంటున్నారు. అయితే వారాహియాత్ర పుణ్యమాని… ఇంతకాలం పవన్ కు ప్రజల్లో ఉన్న కాస్త గౌరవం కూడా పోయిందనే మాటలు తెరపైకి వస్తున్నాయి. దీంతో అది కూడా మట్టి అయిపోయిందని అంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు చంద్రబాబు. కొత్తగా రాయలసీమ వెనకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిందేమీ లేదని ఇప్పటికైనా అర్ధమయ్యిందా అని కామెంట్లు చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా కడప జిల్లాలో అడుగుపెట్టారు చంద్రబాబు. ఈ సందర్భంగా జమ్మలమడుగులో రోడ్ షో నిర్వహించారు.
ఈ క్రమంలో… చంద్రబాబు ప్రసంగిస్తోన్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆయన ఉన్న వాహనానికి వెనుకలే ఉన్న ఓ తోపుడు బండి మంటలకు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుడొకరు ఈ తోపుడు బండిపై చిన్న హోటల్ ను నడుపుతున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చడం వల్ల నిప్పురవ్వలు పడి ఆ తోపుడుబండి దగ్ధమైందని చెబుతున్నారు.
అవును… చంద్రబాబు రాక సందర్భంగా నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని, ఇష్టానుసారంగా పటాకులు కాల్చారంటూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు విమర్శిస్తోన్నారు. నిప్పురవ్వలు పడి తోపుడు బండి మంటల్లో కాలిపోతున్నప్పటికీ.. చంద్రబాబు మాత్రం తన ప్రసంగాన్ని మానకపోవడం గమనార్హం.
ఎవరైనా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా.. అసలు ఆ మంటలు ఎందుకు వస్తున్నాయి.. ఆ బండి ఎవరిది.. దానివల్ల ఎవరి బ్రతుకు దెరువు పోయింది.. అనే కనీస ఆలోచన కూడా లేకుండా చంద్రబాబు వ్యవహరించారని అంటున్నారు. దీంతో… బాబు రాయల్సీమ యాత్ర కూడా పాయే అని అంటున్నారు పరిశీలకులు.