సెల్ఫీ లతో సెల్ఫ్ గోల్.. పోలవరంలో చంద్రబాబుపై సెటైర్స్!

గతకొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటి ప్రాజెక్టులను సందర్శిస్త్గున్నారు చంద్రబాబు. ఇందులో భాగంగా తాజాగా పోలవరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సెల్ఫీలు తీసుకున్నారు. జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే విషయం తప్ప అన్నీ చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబు వేసుకున్న సెల్ఫ్ గోల్స్ పై ఆన్ లైన్ వేదికగా సెటైర్స్ పడుతున్నాయి.

అవును… కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన తర్వాత చంద్రబాబు దాన్ని రాష్ట్రమే నిర్మిస్తుందని తగుదునమ్మా అంటూ హస్తిన వెళ్లి అనుమతి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. లేకపోతే నేడు పోలవరం బాధ్యత మోడీ సర్కార్ ది అయ్యి ఉండేది. ఈ సమయానికి పూర్తయినా ఆశ్చర్యం ఉండకపోయేది. ఇప్పుడు దాన్ని అటూ ఇటూ కాకుండా చేసి పాడేశారు!

ఈ సమయంలో ఇదేదో ఫస్ట్ టైం అన్నట్లు పోలవరం దగ్గర సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారు చంద్రబాబు. “2019 నాటికి పోలవరం పూర్తిచేసి ఎన్నికలకు వెళతాం. రాసుకో.. రాసుకో.. జగన్.. రాసుకో” అని చెప్పిన చంద్రబాబు… తన మాటలకు – చేతలకూ పొంతన ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు మరోసారి పోలవరం వెళ్లి… సెల్ఫీ లు తీసుకుంటూ… ఫీలయిపోతున్నారు.

దీంతో… ప్రాజెక్ట్ లను సందర్శిస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న చంద్రబాబుకి ఈ కార్యక్రమం రాజకీయంగా ఉపయోగపడకపోగా, ఆయన తప్పుల్ని మరోసారి ప్రజలకు గుర్తు చేసేలా ఉందని అంటున్నారు పరిశీలకులు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల పోలవరం పదేళ్లు ఆలస్యమైందని ఆరోపించారు చంద్రబాబు. 2004 నుంచి 2014 వరకు కేవలం 5 శాతం పనులు మాత్రమే జరిగాయని విమర్శించారు.

ఇదేసమయంలో… జగన్ వచ్చాక కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను మార్చారని.. ఏడాదిన్నరపాటు ప్రధాన డ్యామ్ వద్ద పనులే జరగలేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అయితే తన హయాంలో ఏమి జరిగింది అనేది మాత్రం చెప్పలేకపోయారని అంటున్నారు. ఇదే సమయంలో అంబటి రాంబాబు అడిగిన మూడు బేసిక్ క్వశ్చన్స్ కి కూడా చంద్రబాబు సమాధానం చెప్పకుండానే తిరుగుతుండటం గమనార్హం.

అదేవిధంగా… చంద్రబాబు తాను సందర్శించిన ప్రాజెక్ట్ ల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే సెల్ఫీలతో ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం… చంద్రబాబు సెల్ఫీల వల్ల అసలు ఆయన హయాంలో ఏం జరిగిందనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. ఇదే సమయంలో… అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ లను పట్టించుకోని బాబు.. ఇప్పుడు హడావిడి చేయడమేంటని నిలదీస్తున్నారు.

మరోపక్క పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారంటూ సాక్షాత్తూ ప్రధాని మోడీయే చెప్పారని, అంతకంటే ఇంకేం నిదర్శనం కావాలంటున్నారు వైసీపీ నేతలు. తాజాగా తాను అధికారంలో ఉన్నప్పుడు పోలవరంపై 83సార్లు సమీక్షలు చేపట్టినట్లు చెప్పుకున్నారు చంద్రబాబు. తన హయాంలో జరిగింది పని కాదని, కేవలం సమీక్షలని బాబు పరోక్షంగా ఒప్పుకున్నారని నెటిజన్లు కౌంటర్లిస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా… పోలవరాన్ని నిండా ముంచింది చంద్రబాబే అని నొక్కి వక్కానిస్తున్నారు.

కాగా… పోలవరం విషయంలో చంద్రబాబుకు అంబటి మూడు ప్రశ్నలు వేస్తూ.. సమాధానం చెప్పాలని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “పోలవరం వస్తున్న బాబు గారు.. నా మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా?” అంటూ ఆ ప్రశ్నలు సంధించారు.

1. జాతీయ ప్రాజెక్టును రాష్ట్రమే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు?

2. కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ ఎలా నిర్మించారు?

3. 2018 కి పూర్తి చేస్తానని ఎందుకు విఫలమయ్యారు?