ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో టీడీపీ పార్టీ ప్రాభవం నానాటికి పతనావస్థకు చేరుకుంటుంది. అధికార ప్రభుత్వం ఆ పార్టీ కోలుకోవటానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తుంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేసే విషయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ఎక్కువగా తప్పులు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు కూడా చాలా దారుణంగా తయారవుతోంది.
ఆయన జిల్లాలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు. రెండో దశ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలు కావడం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కీలక నేతల నియోజకవర్గాల్లో కూడా ఓటమి అనేది శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి నిజంగా అవమానకరమనే చెప్పాలి. పెద్దగా అచ్చెన్న కూడా దృష్టి పెట్టలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో ఆయన పర్యటనలు చేయాల్సి ఉన్నా సరే అక్కడ నేతలతో కూడా ఆయన పెద్ద చర్చలు జరిపే ప్రయత్నం చేయటం లేదు.
దీని కారణంగా పార్టీ ఎక్కువ నష్టపోతుందనే ఆవేదన కొంతమందిలో వ్యక్తమవుతోంది. ఇక పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన రాయలసీమ జిల్లాల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు అని చెప్పాలి. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే ఆ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం లేకపోతే మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం వంటివి మాత్రమే చేస్తున్నారు. దీనివలన పార్టీ కార్యకర్తల్లో ఆయనపై నమ్మకం అనేది పోతుంది అనే భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు మారకపోతే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఆ పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి.
తెలంగాణ టీడీపీ తరహాలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా పార్టీ పరిస్థితి దిగజారుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడుతో త్వరలోనే సమావేశమై కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో పాద యాత్ర చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారని సమాచారం. ఆయనతో పాటుగా రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ కూడా ఈ యాత్రలో భాగస్వామ్యులవుతారని, ఈ యాత్రతో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీకి చెక్ పెట్టాలని బాబు గారు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది.