తీవ్ర అసహనంతో రగిలిపోతున్న చంద్రబాబు

Chandrababu on fire
Chandrababu on fire
Chandrababu on fire

రాష్ట్రం విడిపోయాక తొలిసారిగా సిద్ధించిన అధికారం కేవలం అయిదేళ్లలోనే కంచికి చేరుతుందని చంద్రబాబు ఏమాత్రం ఊహించి ఉండరు. పచ్చమీడియా భజనలతో పరవశించిపోతూ దేవతవస్త్రాలవంటి అభివృద్ధిని భూతద్దాల్లో చూపిస్తూ అయిదేళ్లపాటు ప్రజలను వెర్రివాళ్లను చేశారు. ఇది 1995 నాటి వెన్నుపోట్ల కాలం కాదని, ప్రజలు అన్ని రాజకీయ పరిణామాలను క్షణాల్లో తెలుసుకుంటున్న సోషల్ మీడియా కాలమని గ్రహించలేకపోయారు. అనుభవం కలిగినవాడని నమ్మి అధికారం అప్పగిస్తే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ, కేంద్రంతో ఉన్న మైత్రిని ఉపయోగించుకుని రాష్ట్రానికి ప్రాణావసరమైన ప్రత్యేకహోదాను తీసుకుని రావడం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం లాంటి పనులను చెయ్యకుండా, కేవలం తన సామాజికవర్గంవారికి మాత్రమే ఆర్ధిక ప్రయోజనాలను కలిగించే అమరావతి పేరుతో భూవ్యాపారం చేస్తూ రాష్ట్ర సంపదను మొత్తం ఒకేచోట కేంద్రీకరించాలనే దుస్సాహసానికి తెగించారు. ప్రతిపక్షం నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేసి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చెయ్యాలని కుటిలయత్నాలు చేశారు. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులను తీసుకుని రాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని కేసుల్లో ఇరికించి జైల్లో వేయించాలని పన్నాగాలు పన్నారు. పరమశుంఠగా పేరుతెచ్చుకున్న కొడుకును దొడ్డిదారిలో పెద్దలసభకు పంపించి అక్షరం ముక్క రానివాడిని ఏకంగా మూడు ప్రముఖశాఖలకు మంత్రిగా చేసేశారు. తనరాష్ట్రం పనేదో తాను చూసుకోక పొరుగురాష్ట్రం వెళ్లి అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర చేసి అయిదు కోట్ల రూపాయలతో ఒక్క ఓటును కొనడానికి ప్రయత్నించి అక్కడి అవినీతి నిరోధక శాఖ వారికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి, జైల్లో పడే ప్రమాదం కనిపించడంతో రాత్రికి రాత్రే అమరావతికి పారిపోయారు! క్షుద్రమీడియాలో కనిపిస్తున్న అభివృద్ధి కళ్ళముందు కనిపించకపోవడంతో చంద్రబాబు అనుభవం అంతా దోచుకోవడంలోనే తప్ప ప్రజలకోసం ఉపయోగపడేది కాదని జనాలకు అర్ధమైపోవడంతో చంద్రబాబును, ఆయన పార్టీని ప్రజలు కుప్పతొట్టిలో విసిరేశారు!

ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో చంద్రబాబు తీవ్రమైన దిగ్భ్రమకు లోనయ్యారు. తమ పార్టీ ఓడిపోవడం కన్నా, కేవలం అయిదేళ్ల స్వల్పవ్యవధిలోనే ఇరవై మూడు సీట్లతో ప్రజలు శిక్షించడం ఆయనకు మింగుడుపడటం లేదు. ఆరు నెలలవరకు ఆ షాక్ లోనుంచి కోలుకోలేక తెలంగాణలోని తన రాజభవనంలో దాక్కున్నారు. ఆ తరువాత ఎలాగోలా బయటకు వచ్చినప్పటికీ అంతలోనే కరోనా రావడంతో మళ్ళీ హైదరాబాద్ కు పారిపోయారు. తన రాష్ట్రంలో జనం కరోనాతో అల్లాడిపోతున్నా కనీసం ఒకసారి పర్యటించి వారిని ఓదార్చడానికి కూడా గడగడలాడిపోయారు. చంద్రబాబు దుర్మార్గానికి ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఫలితమే పంచాయితీ ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి చీపురుతో ఊడ్చిపారేశారు ఓటర్లు. సొంత జిల్లాలో కూడా చంద్రబాబుకు దిక్కులేకుండా పోయింది. కళ్ళముందే లక్షల కోట్ల రూపాయల సంపద కరిగిపోతున్నదని కృంగిపోతున్న చంద్రబాబుకు అమరావతి ప్రాంతవాసులు కూడా కర్రుకాల్చి వాతలు వేశారు.

పంచాయితీ ఎన్నికలంటే గుర్తులు ఉండవని సరిపెట్టుకున్నారు. కానీ నగరపాలిక ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తామని రొయ్యమీసాలు మెలేసినప్పటికీ, రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు మునిసిపాలిటీలలో ఐదో
ఆరో తప్ప మిగిలినవి అన్నీ అధికారపార్టీలోనే జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో చంద్రబాబుకు మతిస్థిమితం కూడా కోల్పోయి ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో కూడా తెలియకుండా రోడ్ షోలలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ నవ్వులపాలవుతున్నారు. ఉదాహరణకు ఆయన నిన్న కర్నూలులో మాట్లాడుతూ “మద్యం దొరక్క కర్నూల్ వాళ్ళు కర్ణాటకకు వెళ్తున్నారు” అనే ఒక అసంబద్ధమైన ఆరోపణ చేశారు. నిజానికి ఏడుపదుల వయసున్న ఒక మాజీ ముఖ్యమంత్రి మద్యం దొరకడంలేదని ప్రజలు బాధపడుతున్నారంటూ మాట్లాడటం చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుంది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం…మద్యం పుచ్చుకోవద్దు అని హితవు చెప్పాలిన నాయకుడు మద్యం దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ మాట్లాడటం చూసి తెలుగుదేశం నాయకులు కూడా అవాక్కయ్యారు. రేషన్ అందడంలేదనో, నీళ్లు అందడంలేదనో, ప్రభుత్వ పధకాలు అందడంలేదనో ఎత్తి చూపితే సమంజసంగా ఉండేది. మద్యం దొరక్కపోతే నిజానికి మహిళలు చాలా సంతోషిస్తారు. ఆ విధంగా చంద్రబాబు మాట్లాడటం చూస్తుంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి చంద్రబాబు దగ్గర పాయింట్స్ ఏమీ లేనట్లే భావించాలి.

నిన్ననే విశాఖలో మాట్లాడుతూ “విశాఖ వాసులు చాల మంచివారు, నిజాయితీపరులు..వారు రాజధానిని కోరుకోవడం లేదు” అంటూ సర్టిఫికెట్ ఇచ్చేశారు. విశాఖవాసులు మంచోళ్ళయితే మరి మిగిలిన రాష్ట్రవాసులు దుర్మార్గులా? అమరావతి ప్రాంతీయులు నీచులా? రాయలసీమవారు దుష్టులా? కుప్పం వెళ్ళినపుడు కుప్పం వారు మంచివాళ్ళు అంటాడు…గోదావరి జిల్లాలు వెళ్ళినపుడు అక్కడివారు మంచివాళ్ళు అంటాడు…ఏమిటీ హాస్యాస్పదమైన వాచాలత? రాజధాని కోరుకోవడం లేదని విశాఖవాసులు ఎవరైనా చంద్రబాబుతో చెప్పారా? చంద్రబాబు విన్యాసాలు చూస్తుంటే ఆయన లక్షలకోట్ల భూవ్యాపార సామ్రాజ్యం చేయిజారిపోతున్నదనే ఆక్రోశం స్పష్టంగా కనిపిస్తున్నది.

అలాగే మరొక పచ్చి అబద్ధం….సుఖంగా జీవించే నగరాల జాబితాలో విశాఖ పట్నం పదిహేడవ స్థానం నుంచి నలభయ్యారో స్థానానికి దిగజారిపోయిందని! ప్రజలను ఎంత అమాయకులుగా చంద్రబాబు భావిస్తున్నారో తెలుసుకోవాలంటే ఆ ప్రకటన చాలు. నిజానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడవస్థానంలో ఉన్న విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఏడాదిన్నరలో పదిహేనవ స్థానానికి ఎగబాకింది! తాను చెప్పిందే వేదం అన్నట్లు అచ్చుగుద్దే పచ్చ మీడియా ఉన్నదన్న నమ్మకంతో పచ్చి అబద్ధాలను ప్రచారం చెయ్యడానికి చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు. కానీ, చంద్రబాబు దురదృష్టం ఏమిటంటే ఆయన మాటలను విశ్వసించేవారు ఒక్కరూ లేరు. చివరకు ఆయన పార్టీలో కూడా. ఇవాళ తెలుగుదేశం పార్టీ చక్రాలు విరిగిపోయి, గాలిలేని టైర్లతో అడుగు కూడా ముందుకు కదలలేని సైకిల్ గా మారిపోయింది. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ఎంత తన్నుకున్నా తెలుగుదేశం పార్టీ నిలబడటం అసాధ్యం! నీళ్లు లేని నదిలో దాహం తీర్చుకోవడం సాధ్యం అవుతుందా?

ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ
విశ్లేషకులు