ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్ల పట్టాల పంపిణీకి రెడీఅయ్యారు. ఉగాది రోజున చేయాలనుకున్న ఈ కార్యం పలు కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. ప్రధానంగా కోర్టు కేసులు, స్టేలు జగన్ చేతులకు బంధాలు వేసేశాయి. ఆస్తి హక్కును కూడ కల్పిస్తూ జగన్ 30 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు. అందుకోసం 26 వేల ఎకరాల భూమిని సేకరించి పెట్టుకున్నారు. కానీ ఉచిత పట్టాల మీద ఆస్తి హక్కు అనేది రాజ్యాగా నిబంధనలకు విరుద్ధమని కోర్టులో పిటిషన్లు పడ్డాయి. వాటిని వేయించింది చంద్రబాబు నాయుడేనని అందరికీ తెలుసు. విక్రయించే హక్కును కలిగించడం విరుద్ధమే కాబట్టి కోర్టు స్టే ఇచ్చింది.
అక్కడ మొదలైన ఆలస్యం కొన్ని నెలలపాటు జరిగింది. దసరా, వైఎస్ఆర్ పుట్టునరోజు, ఆగష్టు 15 అంటూ పలు తేదీలను అనుకున్నప్పటికీ స్టే తొలగకపోవడంతో పంపిణీ కుదరలేదు. పైపెచ్చు సేకరించిన భూముల్లో కొన్నింటి మీద కోర్టులు అభ్యంతరాలను తెలిపాయి. ఎంత ప్రయత్నించినా వాటి నుండి బయటపడలేకపోతోంది ప్రభుత్వం. ఈ ఆలస్యం మూలాన ప్రజల్లో అసహనం ఎక్కువైంది. ఇక ప్రతిపక్షాల వెక్కిరింపుల ఎలాగూ ఉన్నాయి. దీంతో ప్రతిష్టాత్మక పథకం కాస్త నవ్వులపాలు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకే జగన్ తుది నిర్ణయం తీసేసుకున్నారు. ఆస్తి హక్కు లేకుండా డీ-పట్టాల ద్వారానే భూముల పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే వివాదాల్లో ఉన్న భూములను మినహాయించి వేరొక చోట భూములను వెతుక్కున్నారు. క్రిస్మస్ రోజున ఈ పట్టాల పంపిణీ ఉండనుంది.
ఈ ప్రకటన రావడమే ఆలస్యం చంద్రబాబు బ్యాండ్ మేళం బ్యాచ్ రెడీ అయిపోయింది. జగన్ సర్దుబాట్లు చేసుకుని పట్టాల పంపిణీ చేస్తానని తెలపడంతో దాన్ని చట్టపరంగా అడ్డుకునే వీలు లేకుండా పోయింది. అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ మాస్టర్ ప్లాన్ కొత్తదేమీ కాదు. పాతదే. అదే క్రెడిట్ కొట్టేయడం. చేయని పనిని కూడ చేశామని, తమ వలనే అది సాధ్యమైందని ఊదరగొట్టుకోవడమే ఈ క్రెడిట్ కొట్టేసే ప్లాన్. ముఖ్యంగా అమరావతి రైతుకు ముందు ఈ డప్పు కొట్టనున్నారు పచ్చ బృందం. అమరావతిలోని భూములను కూడ పేదలకు పంచాలని జగన్ భావించగా అందుకు అడ్డుపడ్డారు టీడీపీ నేతలు. రైతులు భూములను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే వాటిని పంచుతారా అంటూ కోర్టు కెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు వాటిని పంపిణీ చెయ్యట్లేదు. సో.. దాన్ని గొప్ప విజయంగా చెప్పుకుని తమని తాము అమరావతి సేవియర్స్ అంటూ ప్రొజెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు టీడీపీ నేతలు.
అంతేకాదు జగన్ గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడ లబ్దిదారులకు అందించనున్నారు. ఇది కూడ తన ఘనతేనని క్యాంపైనింగ్ స్టార్ట్ చేశారు. బాబుగారి హయాంలో నిర్మితమైన ఆ టిడ్కొ ఇళ్ళు అరకొర వసతులతో, సరైన మౌళిక సదుపాయలు లేక అద్వానంగా ఉండేవి. జగన్ సర్కార్ వాటిని బాగుచేసి ఇవ్వనుంది. అందులోనూ ఘనత మాదే అంటున్నారు టీడీపీ బృందాలు. తాము పోరాటంచేసి ప్రభుత్వాన్ని తలకిందులు చేసేసి ఇళ్ల పంపిణీ సాధ్యమయ్యేలా చేశామని చెప్పుకుంటున్నారు. ఇక మిగతా భూములు పంపిణీ సమయంలో కూడ ఒకప్పుడు తాము చేయాలనుకున్నామని దాన్నే జగన్ కాపీ కొట్టి ఇప్పుడు చేస్తున్నాడని ప్రతిపక్షం డబ్బాలు కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.