గత ఎన్నికల్లో చంద్రబాబును బీసీలు పూర్తిస్థాయిలో ఆదరించలేదు. కొందరు వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఇదే 2014 ఎన్నికలకు, 2019 ఎన్నికలకు టీడీపీ ఓటు బ్యాంకులో చోటు చేసుకున్న మార్పు. ఈ కొద్దిపాటి మార్పుతోనే తెలుగుదేశం పార్టీ అతలాకుతలం అయింది. 23 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా బీసీలు తమ మీద విరక్తి ప్రదర్శిస్తారని చంద్రబాబు అస్సలు ఊహించలేదు. కానీ అధికారంలో ఉండగా పదవులు, సంక్షేమ పథకాలు, ఇతర డిమాండ్లను నెరవేర్చడంలో బాబుగారు విఫలం కావడంతో బీసీలు మొహం చాటేశారు. అందుకే ముందుగా బీసీలను బుజ్జగించే పని మొదలుపెట్టిన చంద్రబాబు దానితో పాటే ఇంకో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారట. అదే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలను ఆకర్షించడం.
గత ఎన్నికల్లో జగన్ ఎలాగైతే తన ఆయువుపట్టైన బీసీ ఓటు బ్యాంకులో షేర్ తీసుకుని తనను దెబ్బకొట్టారో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉన్న రెడ్డి వర్గాన్ని కొంతమేరకైనా తన వైపుకు తిప్పుకుని జగన్ ను అధికార పీఠం నుండి కిందికి దింపాలని పథక రచన చేస్తున్నారు. అందుకే ఎక్కడైతే వైసీపీ రెడ్డి నేతలు అసంతృప్తితో ఉంటారో అక్కడ వాలిపోతున్నారట. తమ పార్టీలోకి వస్తే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని, అదికారం దక్కితే ప్రత్యేక స్థానం ఉంటుందని నమ్మబలుకుతున్నారట. టీడీపీ వల వేస్తున్న నేతల్లో పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులే కాదు ఎమ్మెల్యేలుగా గెలిచిన రెడ్డి నేతలు కూడ ఉన్నారట. ఆ ఎమ్మెల్యేలంతా జగన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నవారే.
గత ఎన్నికలకు కొన్నాళ్ల ముందే పార్టీలో చేరి, ఎన్నికల్లో గెలిచిన కొందరు నేతలను జగన్ పెద్దగా పట్టించుకోవట్లేదు. వారు సీనియర్ నాయకులైనా సరే వైసీపీ యువ మంత్రుల ముందు నిల్చోవాల్సి వస్తోందట. సరేనని తగ్గినా సదరు యువ నేతలు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఉదాహరణకు నెల్లూరు జిల్లానే తీసుకుంటే ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో తనకు అవమానం జరుగుతోందనే భావనలో ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిది కూడ సేమ్ సిట్యుయేషన్. అందుకే చంద్రబాబు వారిని టార్గెట్ చేశారట. అసంతృప్త రెడ్డి నేతలంతా టీడీపీలో చేరితే రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంకును కొంతవరకైనా జగన్ నుండి దూరం చేయవచ్చని, అప్పుడు తన పరిస్థితే జగన్ కు వస్తుందని అనుకుంటున్నారట.