బెజవాడ టీడీపీ రాజకీయం రోడ్డుకెక్కింది. కీలక నేతలు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల నడుమ బయటపడిన వివాదం పార్టీలోని అంతర్గత పోరును బహిర్గతం చేసింది. పంచాయతీ ఎన్నికలో ఇరువురు నేతలు టీడీపీ తరపున ఎవరికీ వారు అభ్యర్థులను నిలబెట్టడంతో రచ్చ బజారుకెక్కింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 39వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ఎంపీ కేశినేని నాని బలపరుస్తుండగా, అదే డివిజన్ నుంచి మాజీ ఫ్లోర్ లీడర్ గుండారపు హరిబాబు కుమార్తె పూజితను ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరాలు బలపరుస్తున్నారు. దీంతో పార్టీ వీడినవారికి ఎలా మద్దతిస్తారు అంటూ ఆయన్ను రోడ్డు మీదే నిలదీశారు.
దీంతో ఆగ్రహించిన నాని గతంలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను, ఇప్పుడు టీడీపీ నుండి వైసీపీకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఇదే ప్రశ్న వేయగలరా అని, అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినా గెలిచిన ఎంపీని నేను. కింద నుండి పైవరకు ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూడ బొండా ఉమ వర్గానికి నాని వర్గానికి అస్సలు పడట్లేదు. ఇలా ప్రధాన నాయకులు వ్యక్తిగత విబేధాలతో కొట్టుకుంటూ ఉండటంతో శ్రేణులు అయోమయంలో పడ్డాయి. ఇలాగే వదిలేస్తే పార్టీ కృష్ణా నదిలో కలిసి పోవడం ఖాయమనుకున్న చంద్రబాబు అచ్చెన్నాయుడును రంగంలోకి దింపారట.
అచ్చెన్నాయుడు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలాటి చర్చలు జరిపారట. చంద్రబాబు సైతం నానికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్టు చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు పంచాయతీ ఎన్నికల అనంతరం రానున్న ముఖ్యమైన మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ గొడవ మీద సీరియస్ అయ్యారట. నేతలను బుజ్జగించడం లాంటివి పక్కనపెట్టి ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారట. గెలవాల్సిన నగరాల్లో విజయవాడ ముఖ్యమైందని, కాబట్టి పక్కనబెట్టి కలిసి పనిచేసి విజయవాడలో పార్టీని నిలబెట్టాలని గట్టిగా చెప్పేశారట. మరి అధినేత మాటను నాని, వెంకన్నలు సీరియస్ గా తీసుకుని గొడవలను పక్కనపెడతారో లేకపోతే లైట్ తీసుకుని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారో చూడాలి.