దుబ్బాక ఉప ఎన్నికలు హోరా హోరీగా జరగనున్నాయి. అధికార పార్టీ తెరాస పరువు నిలుపుకోవడం కోసం పనిచేస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇవే నాంది కాబోతున్నాయని గెలుపు గుర్రం ఎక్కడానికి తీవ్రంగా కష్టపడుతున్నాయి. బీజేపీ మొదటి నుండి చెబుతున్నట్టే రఘునందన్ ను బరిలోకి దింపి చేయాల్సిన రాజకీయం చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ చివిరి నిమిషం వరకు హైడ్రామా నడిపి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటనతోనే ఎన్నికలు రసవత్తరంగా మారాయి. చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకుర్చగా తెరాస గెలుపు అవకాశాలను కూడ దెబ్బ తీసే సామర్థ్యం ఉన్న నేత.
దుబ్బాకలో ఆయన కుటుంబానికి మంచి పలుకుబడి, క్యాడర్ ఉన్నాయి. పైగా తెరాస రెబల్ అభ్యర్థిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం దుబ్బాకలోనే క్యాంప్ వేసి గెలుపు కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ తరుణంలో వారికి ఊహించని రీతిలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నుండి ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి నాయకత్వం లేకపోయినా పాత క్యాడర్ కొంత అలానే ఉంది. దాని ద్వారానే చంద్రబాబు దుబ్బాకలో రాజకీయం నెరపాలని భావిస్తున్నారట.
ఎలాగూ ఉప ఎన్నికల్లో తాము లేము కాబట్టి తమ వర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నడిపిస్తామని, అప్పుడు గెలుపు సులభమవుతుందని చెబుతున్నారట. ఒకానొక దశలో తమ క్యాడర్ తలుచుకుంటే గెలుపోటములను డిసైడ్ చేయగలదని కూడ చెబుతున్నట్టు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో జోడీకట్టి తీవ్రంగా నష్టపోయిన సంగతిని గుర్తుచేసుకుని చంద్రబాబు ఇస్తున్న అవకాశాన్ని రిజెక్ట్ చేస్తోందట. ఒకవేళ తెరవెనుక కలిసిన అధికార పక్షం ఆ విషయాన్ని వాడుకుని తమను దెబ్బకొట్టే ఆస్కారం ఉందని, అది మొదటికే మోసమని భావిస్తున్నారట. కొందరు నాయకులేమో ధైర్యం చేసి సహకారం తీసుకుంటే తప్పేమిటి అంటున్నారట.